sridevi
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అమరావతి ఆవేదనకు సొల్యూషన్ దొరికినట్టేనా ప్రతి జిల్లాలో ఓ అట్రాక్షన్

అమరావతి ఆవేదన పేరిట.. తాడికొండ నియోజకవర్గం రావెలలో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. అయితే ఈ సభలో తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. యాంకరింగ్ చేయడం.. ఈ సందర్బంగా ఆమె.. జగన్‌ ప్రభుత్వంపై విసిరిన పంచ్‌లు.. బ్రహ్మండంగా పేలాయి.అంతే కాదు గత ఎన్నికల ప్రచారంలో తాను.. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పానని… ఆ క్రమంలోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. కానీ జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల మూడు రాజధానుల ప్రకటన వెలువడిందని.. ఈ నేపథ్యంలో తనను క్షమించాలంటూ ఈ కార్యక్రమ వేదికపై నుంచి అమరావతి రైతులను ఆమె క్షమాపణలు కొరారు. అంతవరకు ఓకే కానీ.. అధికార జగన్ పార్టీ  బహిష్కృత ఎమ్మెల్యే, అదీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూత వేటు దూరం నుంచే ఈ వ్యాఖ్యలు చేసినా.. వైసీపీ అగ్రనేతలు ఎవరూ ప్రెస్ మీట్ పెట్టడం కానీ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం కానీ చేయక పోవడంపై పోలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చ జరుగుతోంది.

ఇక జూలై 28న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ సారథ్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ యాంకర్ ఉదయభాను అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ జయహో బీసీ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతే.. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా వెంటనే రంగంలోకి దిగి.. ట్రోలింగ్ చేయడం ప్రారంభించింది. అలాగే ఫ్యాన్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే  ట్విట్టర్‌ వేదికగా  ఈవెంట్ మేనేజమెంట్‌లో టీడీపీ అధినేతను మించిన వారెవరూ ఉండరు. ప్రతి ప్రోగ్రాంకు ఏదోఒక ‘అట్రాక్షన్’ జతచేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటే. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం చూశాం. ఇక నుంచి సినీ నటుల సందడి మొదలవుతుందని అర్థమవుతోంది అంటే పేర్కొన్నారు.

అయితే ఒంగోలు సభలో ఉదయభాను యాంకరింగ్‌కి వెంటనే స్పందించిన విజయసాయి అండ్ కో.. రావెలలో నిర్వహించిన అమరావతి ఆవేదన సభపై  స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే ఓ సందేహం  పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. అయినా స్పందన జీవ లక్షణం.. ప్రతిస్పందన మనిషి లక్షణం. అలాంటి ప్రతీ స్పందన పుష్కలంగా ఉన్న.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు, కానీ జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు కానీ.. అంటే నాని బ్రదర్స్, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్‌, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ వగైరా వగైరాలు.. సొంత పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై మౌనం వహించడం,  అమెను  పల్లెత్తు మాట అనడానికి సాహసించకపోవడం వెనుక కారణం ఏమిటన్నదానిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

మరోవైపు ఉండవల్లి శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేస్తే.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి  కొన్ని నిజాలు వెల్లడించారు. పలు ఆరోపణలు చేశారు. ఆ తరువాత  నాలుగు నెలల అనంతరం మళ్లీ ఇప్పుడు లోకేష్ సభలో యాంకరింగ్ చేసి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తే   తమ పార్టీలోని పలువురు  నేతల బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయని.. అదే జరిగితే ఆయా నేతల ఫ్యూజూలు ఎగిరిపోయే పరిస్థితి ఉందనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. అయినా చెట్టుకు పువ్వు పూసినా.. కాయ కాసినా.. ఆ కాసిన కాయ నేల రాలినా..  ట్విట్టర్ వేదికగా ఆగమేఘాల మీద స్పందించే విజయసాయిరెడ్డి సైతం .. తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందించకపోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో ఆశ్చర్యం   వ్యక్తమవుతోంది.  అయినా ప్రస్తుతం ఎన్నికల సీజన్..  ఏం మాట్లాడినా  ఆచి తూచి మాట్లాడాలి.. అలాగే అడుగులు వేయాలి.. అదే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై ఒంటి కాలిపై లెచే  సోకాల్డ్ ఈ వీరులంతా..  తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందిస్తే.. వచ్చే ఎన్నికల్లో దళిత ఓట్లు హుళక్కి అయ్యే అవకాశాలు ఉన్నాయనే  భయంతోనే నోరు మెదపడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇంకోవైపు.. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో అమరావతి ఆవేదన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఆయన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి చేత యాంకరింగ్ చేయించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సాహసాన్ని, ఎత్తుగడలను, వ్యూహాలను పలువురు అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.