తెలంగాణ ముఖ్యాంశాలు

ఈటల గౌరవం ఢిల్లీకి తాకట్టు

  • ఆస్తుల రక్షణకే బీజేపీలోకి
  • మంత్రి హరీశ్‌రావు ఫైర్‌
  • 200 మంది బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిక
  • ఈటల వేధింపుల వల్లే రాజీనామా: రవియాదవ్‌


కరీంనగర్‌, జూన్‌ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్‌.. 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం రవియాదవ్‌ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌, ఆయన అనుచరుల వేధింపులు భరించలేకనే తాము పార్టీని వీడామని స్పష్టంచేశారు.

టీఆర్‌ఎస్‌లో చేరింది వీరే..

బీజేపీ మండల అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్‌తోపాటు ఉపాధ్యక్షుడు ఇంగ్లీ రమేశ్‌, ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్‌, కార్యదర్శి మెరుగు జయశంకర్‌, జిల్లా అధికార ప్రతినిధి తనుగుల తిరుపతి యాదవ్‌, ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్‌, దళిత మోర్ఛా అధ్యక్షుడు గుత్తికొండ రాంబాబు, యువ మోర్ఛా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌, ఓబీసీ మోర్ఛా ఉపాధ్యక్షుడు తనుగుల అనిల్‌కుమార్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల సుమన్‌, లక్ష్మన్‌పల్లి ఉపసర్పంచ్‌ వంగ రాజయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్‌ తిరుపతిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన బూత్‌కమిటీ అధ్యక్షులు, పార్టీ కమిటీ సభ్యులు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.