తెలంగాణ ముఖ్యాంశాలు

ఏపీ పాలకుల దాదాగిరి నడవదు

  • అక్రమ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం
  • దారిచూపాల్సిన బాధ్యత మరిచిన కేంద్రం
  • మండిపడ్డ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • జోగులాంబ సక్రమ ప్రాజెక్టేనని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంను అడ్డుకుని తీరుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. స్వరాష్ట్రంలో కూడా తెలంగాణపై పెత్తనం, దాదాగిరి చేస్తామంటే నడవదనే విషయం పక్కరాష్ట్ర పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోగులాంబ బరాజ్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఈ నిర్మాణానికి ఎవరు అడ్డు వస్తారో చూస్తామని సవాల్‌ విసిరారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ లెక్కల ప్రకారం జూరాల ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తంలో నీటిని వాడుకోలేకపోతున్న నేపథ్యంలోనే ఈ బరాజ్‌ నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు, తెలంగాణ సక్రమ ప్రాజెక్టులకు పొంతనేలేదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాససముదాయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే నీటి కోసం అన్న విషయాన్ని ఆంధ్రా పాలకులు గుర్తించాలని, కృష్ణా జలాలపై హక్కును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని స్పష్టంచేశారు. కృష్ణానదిపై నీటివాటాలో హక్కులున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కోసం ఏం చేయాలో తమకు తెలుసని చెప్పారు. ఆంధ్రా నీటి కేటాయింపులకు లోబడి ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతలు అక్రమమమని తెలిసినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

విద్రోహంతోనే విలీనం
నీటిని, నిధులను ఎత్తుకెళ్లాలనే కుట్రతోనే 1956లో హైదరాబాద్‌ రాష్ర్టాన్ని ఆంధ్రాలో విలీనం చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో బూర్గుల ప్రభుత్వం 180 టీఎంసీల నీరు వాడుకునేలా అప్పర్‌ కృష్ణ, తుంగభద్రలో-లెవెల్‌ కెనాల్‌, భీమా ఇరిగేషన్‌ ప్రాజెక్టులను తలపెట్టిన విషయాన్ని బచావత్‌ ట్రిబ్యునల్‌ వెల్లడించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ప్రాజెక్టులన్నీ వెనక్కిపోయాయని ట్రిబ్యునల్‌ గుర్తించిందని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో 26 వేల చదరపు మైళ్లు, తెలంగాణలో 20 వేల చదరపు మైళ్లు ఉంటే..ఏపీలో కేవలం 9 వేల చదరపు మైళ్లు ఉన్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత తెలంగాణ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు పక్కనపెట్టి ఆంధ్రాకు లబ్ధిచేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు జిల్లాకు సాగునీటి వసతి కల్పనకు బచావత్‌ ట్రిబ్యునలే 17.84 టీఎంసీల నీటిని జూరాలకు కేటాయించిన చరిత్రను తెలుసుకోకుండా ఆంధ్రానాయకత్వం పిడివాదం చేస్తున్నదని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు ద్వారా 17.84 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం లేకపోతే, దానిని పాలమూరు జిల్లాలోనే మరోచోట వినియోగించుకోవచ్చని బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంచేసిందని వివరించారు. దీనికి రెండు రాష్ర్టాల నీటి వాటాలకు సంబంధమే లేదని స్పష్టంచేశా

కరోనా కష్టకాలంలోనూ పంట కొనుగోళ్లు
కరోనా కష్టకాలంలో రైతులు పండించిన పంటను సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధుపై కొందరు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 90శాతం మంది ఐదెకరాల్లోపు భూములు ఉన్నవారేనని వివరించారు. రైతుబంధు ద్వారా రూ.7,360 కోట్లను పంపిణీ చేశామని తెలిపారు. సమావేశంలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌లు దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, అబ్రహాం, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టు రాయలసీమను అడ్డుకొని తీరుతాం. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారమే జోగులాంబ బరాజ్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారు. దీనికి ఎవరు అడ్డు వస్తారో చూస్తాం. కృష్ణా జలాలపై హక్కును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోం. రాయలసీమ ప్రాజెక్టుపై అసలు కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టంచేయాలి. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? రాష్ర్టాలకు దారిచూపాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించింది.
-మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

కాంగ్రెస్‌ నేతలు బానిస వైఖరి వీడాలి
మద్రాసు నగరానికి మంచినీళ్ల పేరుతో తెలుగుగంగను మొదలుపెట్టారని, ఆ పనుల ప్రారంభానికి రూ.50 కోట్ల చెక్కు ఇందిరాగాంధీ చేతుల మీదుగా స్వయంగా ఇచ్చారన్న విషయం కాంగ్రెస్‌ నేతలు గుర్తుంచుకోవాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. కృష్ణానీటిలో తెలంగాణ వాటాను ఇంకా దోపిడీ చేస్తామంటే ఊరుకునేదిలేదని స్పష్టంచేశారు. విద్యుత్తు ఉత్పత్తి కోసం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కులు తరలించి, తర్వాత 44 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన నీటి దోపిడీని ఇంకా రాయలసీమ ఎత్తిపోతలతో కొనసాగిస్తామంటే కుదరదని ఆయన స్పష్టంచేశారు. ఆంధ్రా ప్రాంత ప్రయోజనాల కోసం అక్కడ పార్టీలకు అతీతంగా ఏకమై తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతుంటే, ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు బానిస వైఖరిని వీడటం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే అక్కడ ఏ పార్టీ నేతలు కేసులు వేయలేదని తెలిపారు. ఆకలితో అల్లాడిన తెలంగాణలో సక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే మన సన్నాసులే వందల కేసులు వేస్తున్నారని, ఇది ఇక్కడి నాయకుల బానిస వైఖరికి నిదర్శమని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌పై మాట్లాడుతున్న నేతలంతా అప్పట్లో జలదోపిడీకి కావడిమోసిన వాళ్లేనని ధ్వజమెత్తారు. ఒక మాజీ మంత్రి హారతులు పడితే, ఇంకో మాజీ మంత్రి పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాశాశారని, ఇంకో మాజీ మంత్రి రాజశేఖర్‌రెడ్డి లాంటి వ్యక్తి మా ప్రాంతంలో పుట్టలేదే అన్నారని, ఆ విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదని ఉదహరించారు.