కోవిడ్-19 కేసులతో ఇండోనేషియా తల్లడిల్లిపోతున్నది. ఆదివారం ఒక్కరోజే 21 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటంతో మరో రికార్డు నమోదైంది. దేశ రాజధాని జకార్తాతోపాటు ఇతర హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని దవాఖానలన్నీ కోవిడ్-రోగులతో నిండిపోయాయి. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 21 లక్షలు దాటింది. 57,138 మంది మ్రుత్యువాత పడ్డారు.
అయితే, వాస్తవంగా ఈ ప్రాణాంతక కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చునని అంచనా. మే నెలలో రంజాన్ ఉపవాసాల కారణంగా లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించడం వల్లే కరోనా కేసులు పెరిగి పోయాయని భావిస్తున్నారు.
మరోవైపు, అధికారులు న్యూ వైరస్ స్ట్రెయిన్లతో తీవ్రంగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మున్ముందుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగవచ్చునని భావిస్తున్నాం అని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ అధికార ప్రతినిధి నదియా తార్మిజి చెప్పారు. వచ్చే 2, 3 వారాల్లోనే గరిష్ఠ స్థాయిని తాకొచ్చునన్నారు.
జకార్తాతోపాటు వెస్ట్ అండ్ సెంట్రల్ జావా ప్రాంతాల్లో దవాఖానలు కోవిడ్-19 రోగులతో నిండిపోయాయి. వీరిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ సోకిన వారు కూడా ఉన్నారు.