అధికార పార్టీకి చెందిన నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'నా జోలికొస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తా'అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నాగర్ కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డికే టికెట్ కేటాయించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆయన.. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు.
తెల్కపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి.. ఆదివారం రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోపంతో ఊగిపోయిన ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానని ధ్వజమెత్తారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందని హెచ్చరించారు. ‘నా జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చిపడేస్తాను’ అంటూ ఎమ్మెల్యే వివాదాస్పదంగా మాట్లాడటం తీవ్ర చర్చనీయంగా మారింది.