తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచించింది. రానున్న రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో వాతావరణం గురించి తెలుసుకుందాం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు అంటే సోమ, మంగళ వారాల్లో కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వర్షసూచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘాలు విస్తరించి ఉన్నా వర్షాలు పడటం లేదు.
అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్ర, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఉండవచ్చు. ఇవాళ సాయంత్రం రాయలసీమ, కోస్తా, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. తూర్పు ఆసియా, అగ్నేయాసియా దేశాల్నించి వీస్తున్న బలమైన గాలులతో ఆకాశం మేఘావృతంగా ఉంటోంది. మరోవైపు ఫిలిప్పీన్స్ సమీపంలో అత్యంత బలమైన తుపాను కారణంగా చైనా, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాలతో పాటు ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తుపాను ప్రభావంతో గాలుల వేగం ఇక్కడ పెరుగుతోంది.
ఇవాళ పశ్చిమ బెంగాల్, మేఘాలయ, సిక్కిం, లక్షద్వీప్ సహా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చు. ఇన్సాట్ 3డి శాటిలైట్ ఆధారంగా ఐఎండీ వాతావరణం అంచనా వేస్తోంది.