ap-group
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, 597 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆదేశాలు

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఖాళీల్ని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఎన్ని పోస్టులున్నాయి. ఇతర వివరాలు పరిశీలిద్దాం..

గ్రూప్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడనుంది. పోస్టుల భర్తీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక మిగిలిన ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్ 1 కేటగరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగరీ-2, అసిస్టెంట్ కమీషనర్ ( ఎస్టీ) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, బీసీ సంక్షేమ శాఖ, ఆర్ధిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవిన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు భవనాల శాఖల్లో గ్రూప్ 1 పోస్టుల్నిఏపీపీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నారు.

ఇక ఏపీ సచివాలయంలోని ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయ, లెజిస్లేచర్ శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ కానున్నాయి. గ్రూప్ 2 లో అత్యధికంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 161, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 150, డిప్యూటీ తహశిల్దార్ ( గ్రేడ్ 2) పోస్టులు 114 ఉన్నాయి.గ్రూప్ 1 కేటగరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగరీ-2, అసిస్టెంట్ కమీషనర్ ( ఎస్టీ) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఇక గ్రూప్-2 కేటగరీలో డిప్యూటీ తహశిల్దార్ ( గ్రేడ్-2), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2తో పాటు మరి కొన్ని ఉద్యోగాల భర్తీకు ఏపీపీఎస్సీకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తం 597 పోస్టులు భర్తీ కానున్నాయి.