harish rao
తెలంగాణ రాజకీయం

గుండెల నిండా భక్తి భావం ఉన్న వ్యక్తి సిఎం కెసిఆర్: హరీశ్ రావు

గుండెల నిండా భక్తి భావం కలిగి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. “వల్మీడిలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని పునర్ నిర్మించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదృష్టవంతుడు. వాల్మీకి పుట్టిన ఊరు వాల్మీకిపురం కాలక్రమేణా వల్మీడిగా మారింది. ఇక్కడే ఆది కావ్యం రామాయణాన్ని మునుల గుట్ట మీద వాల్మీకి రాశారు అని ప్రతీతి. శ్రీ రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఇక్కడి రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేసేలా ముందుకు వెళ్తాం. సీఎం కేసీఆర్.. గుండెల నిండా భక్తి భావాన్ని కలిగిన వ్యక్తి. సీఎం కేసీఆర్ దేవాలయాలు నిర్మించడమే కాదు.. నిర్మించిన అన్ని దేవాలయాల్లో దీప దూప నైవేద్యాలు కార్యక్రమం జరిగేలా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 3700 దేవాలయాలకు దూప దీప నైవేద్యాల కింద నిధులు కేటాయిస్తున్నాం. కొత్తగా చేర్చే దేవాలయాలతో ఆ సంఖ్య 7 వేలకు పైగా దాటింది. దీప దూప నైవేద్యాలు కోసం ఇచ్చే రూ.6 వేలను రూ.10 వేలు చేశారు.

ఆధ్యాత్మిక భావనతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. సీఎం కేసీఆర్ భగవంతుడిని నమ్ముతారు.. యాగాలు చేస్తారు. అందుకే 10 ఏళ్లుగా మంచి వర్షాలు పడ్డాయి.. కరువు కాటకాలు రాలేదు. పరిపాలకులు దేవుడికి సేవ చేస్తే కృప ఉంటుంది. యాదాద్రి, కొండ గట్టు, భద్రాద్రి, కాళేశ్వరం ఆలయాలు సహా అనేక ఆలయలు నిర్మిస్తున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంచడంతో పాటు దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. మా కేబినెట్ లోనే అత్యధిక అవార్డులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాఖకు వచ్చాయి. దేశంలో 3 శాతం జనాబా ఉన్న తెలంగాణకు 38 శాతం అవార్డులు వచ్చాయి. ఉత్తమ గ్రామాలు, జిల్లాలుగా తెలంగాణకే అన్ని అవార్డులు వచ్చాయి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నాం. మిషన్ భగీరథకు రాని అవార్డు లేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. హెలికాప్టర్ లో వస్తుంటే ఈ ప్రాంతం పంటలతో పచ్చగా.. చెక్ డాంలన్నీ నీళ్లు నిండి ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతో కష్టపడతారు” అని పేర్కొన్నారు.