polavaram
ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. నిర్మాణ లోపాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. సమస్యలను ఎలా అధిగమించాలని.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వరుసగా ఎదురవుతున్న సమస్యలు.. వారి పరిష్కారానికి తీసుకోవాల్సిన మార్గాలపై దృష్టిపెట్టి… నిర్మాణం పకడ్బందీగా సాగేందుకు ప్రణాళికలు రూపొందిచనుంది. దీని కోసం త్వరలోనే కేంద్రం బృందం సంయుక్త భేటీ నిర్వహించనుంది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. 2021 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ కూడా నిలబడలేదు. ఇదంతా టీడీపీ హయాంలో జరిగిన తప్పుల వల్లే అంటోంది వైసీపీ సర్కార్‌.

కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ కట్టారని ఆరోపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని.. అందుకే పోలవరం ఆలశ్యమైందని చెప్తోంది. ఇక.. జగన్‌ మూర్ఖత్వం వల్లే పోలవరం పూర్తికావడంలేదని, డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులే చేపట్టలేదన్నారు. వైసీపీ, టీడీపీ ఆరోపణలతో… పోలవరంపై రాజకీయ రగడ జరుగుతోంది. మరోవైపు గోదావరి మట్టం పెరిగినప్పుడల్లా వరద ముంపు ప్రాంతాలను ముంచెత్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి పెడుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేంద్రజల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌ ఆధ్వర్యంలోని కేంద్రం బృందం పోలవరం నిర్మాణ సమస్యలపై కసరత్తు చేస్తోంది. పోలవరంలో స్పిల్‌వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించినా సీపీజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. అంతకుముందు ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ఉధృతికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాలే కీలకం. దీంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలో నిర్ణయం తీసుకోవల్సి ఉంది. దీంతో కేంద్ర జల్‌శక్తి పెద్దలు నడుం బిగించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌ నేతృత్వంలో ఇందుకు కసరత్తు సాగుతోంది. కేంద్రం సంస్థలతో… జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు  శ్రీరామ్‌ అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలవరం నిర్మాణంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి… అనేది ఆరా తీస్తున్నారు. పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. సెప్టెంబరు 10 నాటికి ఈ కసరత్తు కొలిక్కిరావొచ్చని భావిస్తున్నారు.

కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌… రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరం అధికారులతోనూ సమావేశంకానున్నారు. ఆ తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి బాధ్యతల బదలాయింపుపైనా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.