తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం తెల్లవారుజామున పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కనసాగుతోంది. అలాగే దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాత్రి కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణ వచ్చే రెండు రోజులు కూడా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది.
ఇక వచ్చే నాలుగు రోజులు పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ నెలలో 6వ తేదీ నంఉచి 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వీడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు