ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు, ఆర్థిక అవకతవకలకు కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలు ఉన్నాయా అన్న విషయంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టు విషయంలో మోడీ సర్కార్ ఆశీస్సులూ, ప్రోత్సాహం, అండదండలూ జగన్ రెడ్డి సర్కార్ కు ఉన్నాయన్న అభిప్రాయానికి రోజురోజుకూ బలం చేకూరుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, నిబంధనలను తోసి రాజని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇష్టారీతిన అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసే సాహసం చేసిందంటే.. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ముందడుగు వేసిందని నమ్మలేమని పరిశీలకులు సైతం అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అరెస్టు విషయంలో తమకు కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు సంపూర్ణంగా ఉందని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అంతే కాదు..ఈ ఒక్క కేసే కాదు రానున్న రోజులలో మరిన్ని కేసులలో చంద్రబాబును విచారిస్తామనీ, చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నూ తెలుగుదేశం ముఖ్య నాయకులనూ కూడా అరెస్టు చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు.
అయితే ఈ ప్రచారం వ్యూహాత్మకమా? వాస్తవమా అన్నది పక్కన పెడితే జనబాహుల్యంలో మాత్రం జగన్ రెడ్డికి మోడీ, షాల మద్దతు సంపూర్ణంగా ఉందని భావనే వ్యక్తం అవుతోంది. వైసీపీ చెబుతున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు వైసీపీ అడ్డగోలు అరాచక చర్యలకు అండదండలు అందిస్తూనే, ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని చూసీ చూడనట్లు వదిలేసి మరిన్ని అనుమతులకు అప్పులిస్తూనే.. మరో వైపు జగన్ ను బీజేపీ అధినాయకత్వం చక్రబంధంలో బిగించేసిందా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని తాను విదేశీ పర్యటనలో ఉండగా స్కిల్ స్కామ్ పేరిట అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేయించిన తీరు పట్ల దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండిస్తున్నాయి. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా స్పందించలేదన్న మాటే కానీ బీజేపీకి చెందిన రాష్ట్రాల అధ్యక్షులు, పలువురు కేంద్ర మంత్రలు చంద్రబాబు అరెస్టును ఖండించారు.
జగన్ అరాచకాలను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు భువనేశ్వరి అయితే చంద్రబాబు అరెస్టు తీరు అప్రజాస్వామికమని విమర్శించడమే కాకుండా, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని, అవినీతి పాలనను కడిగిపారేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ఇలా బీజేపీ నాయకులంతా కూడా జగన్ అరాచకాన్ని తూర్పారపడుతూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఇదలా ఉంచితే చంద్రబాను అరెస్టుకు బీజేపీ అధినాయకత్వం మద్దతు ఉందని చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ నేతలకు ఈ పరస్థితి మింగుడు పడటంలేదు.జగన్ తన విదేశీ పర్యటన నుంచి వచ్చీ రాగానే హస్తిన పర్యటనకు వెళతారనీ, మోడీ, అమిషాలతో భేటీ అవుతారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదిగో బయలుదేరుతున్నారు..అదిగో బయలుదేరుతున్నారు అంటూ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ హస్తిన పర్యటనకు వెళ్లిందీ లేదు. అసలు వెడతారో లేదో కూడా తెలియదు. ఆయన యధా ప్రకారం బటన్ నొక్కుడు కార్యక్రమాలలో మునిగిపోయారు.
చంద్రబాబు అరెస్టును సమర్ధించుకుంటూ ఆయా కార్యక్రమాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వినలేక జనం బయటకు వెళ్లి పోతున్న దృశ్యాలు మీడియాలో అందరూ చూశారు కూడా. అది పక్కన పెడితే.. ఇంతకీ జగన్ హస్తిన పర్యటనకు ఎందుకు వెళ్లలేదు. ఆయనకు మోడీ, షాల అప్పాయింట్ మెంట్ దొరకలేదా? లేదా హస్తిన వెడితే చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్న బెరుకా? లేక ఇప్పటికే హస్తినలో లోకేష్.. బాబు అక్రమ అరెస్టునకు నిరసనగా జాతీయ మీడియా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన నేపథ్యంలో జగన్ హస్తినలో అడుగుపెడితే.. లోకేష్ చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు విసిరిన సవాల్ కు జవాబు చెప్పాల్సి వస్తుందన్న బెరుకా అంటూ సామాజిక మాధ్యమంలో జగన్ కు ఓ రేంజ్ లో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజనులు.వాస్తవానికి చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు కారణంగా ఏపీలోనే కాదు దేశ విదేశాల్లో కూ డా వైసీపీతో పాటుగా మోడీ సర్కార్ పై కూడా ఆగ్రహం పెల్లుబుకుతోంది. తమ పరువును జీ20 శిఖరాగ్ర సదస్సు సాక్షిగా గంగలో కలిపేసిన జగన్ పై ఆగ్రహంతో బీజేపీ అధినాయకత్వమే ఆయనను దూరం పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో ఇంతటి అరాచక పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్ కు అడ్డగోలుగా అప్పులు చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఇంకా అనుమతులు ఇస్తుండటంతో అసలు ఏం జరుగుతోంది? అప్పాయింట్ మెంట్ లేదనడం, జగన్ హస్తిన పర్యటన నిరవధికంగా వాయిదా పడటం, బీజేపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తుండటం ఇదంతా ప్రజలను మభ్యపెట్టే వ్యూహంలో భాగమేనా? అన్న అనుమానాలను కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ తన ప్రతిష్టను మంటగలుపుకుని మరీ జగన్ తో బంధం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో జగన్ కు వత్తాసు పలుకుతున్న బీజేపీపై జాతీయ స్థాయిలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతున్నదనడానికి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతే నిదర్శనమంటున్నారు.