రెబల్స్ బెడదను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ల ఫార్ములాను తెరమీదకు తెస్తున్నది. ఈ సారికి తప్పుకోవాలని మరో ఆరు నెలల్లో జరగబోయే లోక్ సభ ఎంపీ టికెట్లు మీకే కేటాయిస్తామంటూ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది. లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇస్తున్నట్టు సమాచారం. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేతల్లో చాలా మంది తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. వారిలో బలమైన నాయకులు కూడా ఉండడం గమనార్హం. గతంలో ఎంపీగా కొనసాగిన ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి (మల్కాజ్ గిరి) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ కుమార్ రెడ్డి(నల్లగొండ) ఈ సారి అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న వారు ఈ సారి శాసన సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు వీళ్ల టికెట్లు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది.కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. హుస్నాబాద్ స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ప్రవీణ్ రెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన ఈ పాటికే వాల్ రైటింగ్స్ సైతం చేయిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 62 వేల ఓట్లు పోలవడం గమనార్హం. 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయించింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాడ వెంకటరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 1.79 లక్షల ఓట్లు సాధించారు. ఈ సారి ఎలాగైనా హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
అయితే ఇదే స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐ అడిగే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి చాడా వెంకట్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐతో పొత్తు కోసం హుస్నాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి మల్ రెడ్డి రాంరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల గాంధీ భవన్ లో గో బ్యాక్ మధుయాష్కీ అంటూ పోస్టర్లు వెలిశాయి. ప్యారాచూట్ లీడర్ అంటూ పోస్టర్లలో పేర్కొనడం కలకలం రేపింది. ఆ సందర్భంగా తనది ఎల్బీనగర్ సెగ్మెంటే అని మధుయాష్కీ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మల్కాజ్ గిరి టికెట్ ఆశిస్తున్న నందికంటి శ్రీధర్ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.వాల్ రైటింగ్స్ పూర్తి చేసిన శ్రీధర్.. పండుగలు, పబ్బాలకు, అగ్రనేతలు వచ్చినప్పుడు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ టికెట్ ను ఆయనకు కేటాయించే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ స్థానాన్ని క్రికెటర్ అజారుద్దీన్, మాజీ మంత్రి దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆమేర్ జావిద్ ఆశిస్తున్నారు. అలాగే జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగాలనుకుంటున్నారు. పరకాల నుంచి కొండా మురళీధర్ రావు, ఇనగాల వెంకట్రామిరెడ్డి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి సీనియర్ నేతలు జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. వనపర్తి స్థానం నుంచి మాజీ మంత్రి జీ చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి, టాస్క్ ఫోర్స్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోలేదు. రేణుకాచౌదరి ఖమ్మం లోక్ సభ, చామల కిరణ్ కుమార్ భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
బలమైన లీడర్లు పోటీ పడుతున్న అసెంబ్లీ టికెట్లను ఓ కొలిక్కి తెచ్చే పనిలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంప్రదింపులు ప్రారంభించింది. ఇద్దరితోనూ మాట్లాడి ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని బుజ్జగించేందుకు రెడీ అవుతున్నది. ఏక పక్షంగా టికెట్ కేటాయిస్తే రెబల్ గా బరిలోకి దిగడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కీలకమైన సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం, తిరుగుబాటు అభ్యర్థులు బరిలో లేకుండా చూసుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ముందున్న టాస్క్.