రాష్ట్ర విభజనపై మరోసారి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ చేసిన వ్యాఖ్యలు… తెలంగాణకు చెందిన కమలనాథులకు ఇబ్బందికరంగా మారాయి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. రక్తపుటేర్లు పారాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ సంబరాలు చేసుకోలేకపోయాయి. విభజన సమయంలో విష బీజాలు నాటబడ్డాయి. వాజ్‌పేయి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పాటైన మాదిరిగా అదే ఉత్సాహంతో తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఈ రోజు తెలంగాణ ఒక కొత్త శిఖరానికి చేరుకునేది..’’ అంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్స్. సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరికొద్దిరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి మిగతా పక్షాలు. తెలంగాణ విరోధి అంటూ ప్రధాని మోదీని టార్గెట్ చేయటంతో పాటు…బీజేపీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఫలితంగా తెలంగాణలోని రాష్ట్ర నాయకత్వం అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది.నిజానికి గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విభజన సరిగా జరగలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన ఏపీని సిగ్గుపడేలా కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోని పలు పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు. మరోసారి ఇదే తరహా వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వందలాది మంది అమరవీరుల త్యాగాలను కించపరచటమే అని చెబుతున్నారు.తెలంగాణ పోరాట స్ఫూర్తిని కించపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. బీఆర్ఎస్ లోని మంత్రులతో పాటు ముఖ్య నేతలందరూ స్పందించారు. ప్రధాని మోదీ తెలంగాణ విరోధి అని, మరోసారి విషం చిమ్మారని ఆరోపిస్తున్నారు.
వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున స్వయంగా రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని ఆగ్రంహ వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే అని ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వంలోని నేతలంతా మోదీతో పాటు బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.మోదీ వ్యాఖ్యలతో తెలంగాణ కమలనాథులు అంతర్మథనంలో పడిపోయారు. ఒక్కరిద్దరు నేతలు తప్ప… మిగతవారి నుంచి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయటంతో పాటు… కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విభజనపై మోదీ చేసిన కామెంట్స్… ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారట..! అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించారు.
రాహుల్ గాంధీ ట్వీట్‌కు బండి సంజయ్ స్పందిస్తూ… 1400 మంది మరణాలకు కారణమైంది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. పెద్ద మనషుల ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందెవరంటూ నాటి ప్రధాని నెహ్రూను ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. వేలాది మంది మరణాలకు కారణమైన మీరు, మీ కుటుంబం ఇంకెన్ని సార్లు క్షమాపణలు చెప్పాలి?రాహుల్ జీ ఇకనైనా స్క్రిప్ట్ మార్చండి’’ అంటూ సెటైర్లు విసిరారు.