ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో ఐదుగురి దారుణ హత్య
క్రైంకథా చిత్రాన్ని తలపిస్తున్న సంఘటన
మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన దారుణం
ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు ఆమెను కాదని మరో మహిళతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆగ్రహించిన లవర్ ప్రియుడికి కాబోయే భార్య ఫోటో, ఫోన్ నంబర్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దాంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేశాడు. వారందరిని పోలంలో పది అడుగుల లోతులో పాతి పెట్టాడు. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌహాన్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల పాటు బాగానే సాగినప్పటికి ఆ తర్వాత సురేంద్ర మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీని గురించి రూపాలికి తెలిసింది. ఆగ్రహించిన ఆమె సురేంద్ర చేసుకోబోయే యువతి ఫోటో, ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం కాస్త సురేంద్రకు తెలియడంతో రూపాలి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు.
దానిలో భాగంగా ఈ ఏడాది మే 13న రూపాలి సోదరుడు పవన్ ఓస్వాల్(13)ని కలిసి.. మమతా బాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) తో పాటు బంధువుల అమ్మాయి పూజా ఓస్వాల్ (15)ని, తాను చెప్పిన ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒప్పించాడు. వారంతా అక్కడకు చేరుకున్న తర్వాత సురేంద్ర వారిని హత్య చేసి.. సమీప పొలంలో పది అడుగులు గొయ్యి తీసి.. మృతదేహాలను పూడ్చిపెట్టాడు.
బయటపడిందిలా..
రూపాలితో పాటు మిగతవారు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేసును పక్కదోవ పట్టించడం కోసం సురేంద్ర, రూపాలి సోషల్ మీడియా నుంచి ఆమెలా పోస్టులు చేస్తుండేవాడు. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని.. వేరే ప్రాంతంలో ఉంటున్నానని.. మిగతా కుటుంబ సభ్యులు తన దగ్గరే ఉన్నారని మెసేజ్‌లు చేసేవాడు.
కాల్ రికార్డ్‌తో వెలుగులోకి వచ్చిన దారుణం..
ఈ మెసేజ్‌లపై పోలీసులకు అనుమానం రావడంతో రూపాలి కాల్ లిస్ట్ చెక్ చేశారు. దానిలో సురేంద్ర నంబర్‌కు ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలా అసలు విషయం బయటకు వచ్చింది. తాను రూపాలిని ప్రేమించానని.. కానీ ప్రస్తుతం వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపాడు. ఇందుకు రూపాలి అంగీకరించలేదని తెలిపాడు. రూపాలి బతికుంటే ఎప్పటికైనా ప్రమాదామే అని భావించి ఆమెను, ఆమెతో పాటు తమ ప్రేమ గురించి తెలిసిన మిగతా వారిని చంపేశానన్నాడు. పోలీసులు సురేంద్రతో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లి.. జేసీబీ ద్వారా అస్థిపంజరాలను బయటకు తీశారు. (చదవండి: చావనైనా చస్తాను..పెళ్లికి మాత్రం ఒప్పుకోను)