తెలంగాణ ముఖ్యాంశాలు

జేబీఎస్‌, ఎంజీబీఎస్‌: బండి పెడితే బాదుడే..

జేబీఎస్,ఎంజీబీఎస్‌లలో పార్కింగ్‌ దోపిడీ

టిమ్స్‌ యంత్రాలు ఉన్నా గంటల లెక్కల్లో గందరగోళం

అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

‘బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్‌ సిద్ధిపేట సమీపంలోని కొండపాకలో పని చేస్తాడు. ప్రతి రోజు ఉదయం జేబీఎస్‌ నుంచి బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం నగరానికి చేరుకుంటాడు. అప్పటి వరకు అతని బైక్‌ జేబీఎస్‌ పార్కింగ్‌లో ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కింగ్‌ చేసినందుకు ప్రతి రోజు రూ.40 వరకు పార్కింగ్‌ ఫీజు చెల్లించవలసి వస్తుంది. బండి పెట్టాలంటేనే భయమేస్తుంది. ఒక్క నిమిషం తేడా ఉన్నా  రూ.10 అదనంగా తీసుకుంటారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు..’ అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. 

 ఒక్క ప్రవీణ్‌ మాత్రమే కాదు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లలో బండి పార్క్‌ చేస్తే చాలు ప్రయాణికుల జేబులకు చిల్లులు పడాల్సిందే. పార్కింగ్‌ నిర్వాహకులు అడిగినంతా ఇవ్వలేకపోతే  దౌర్జన్యానికి  దిగుతున్నారు. పార్కింగ్‌ ఫీజుల్లో పారదర్శకత  కోసం  టిమ్స్‌ యంత్రాలను ప్రవేశపెట్టినప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో   వేలాది  మంది ప్రయాణికులు  ప్రతి నిత్యం దోపిడీకి గురవుతున్నారు. జూబ్లీబస్‌స్టేషన్‌లో  ఇటీవల  పార్కింగ్‌ దోపిడీకి గురైన ప్రయాణికుడు ఒకరు  సామాజిక మాధ్యమాల్లో  సైతం  ఆందోళన వ్యక్తం చేశారు.  

లెక్కల్లో  చిక్కులు..
బస్‌స్టేషన్లలో పార్కింగ్‌ నిర్వహణ పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంది. అయితే పార్కింగ్‌ ఫీజులను మాత్రం  ఆర్టీసీ నిర్ణయిస్తుంది. కానీ అమలుపై ఆ సంస్థ నియంత్రణ కోల్పోతోంది. ద్విచక్ర వాహనాలకు  3 గంటలకు  రూ.10 చొప్పున, 15 గంటలకు  రూ.30 చొప్పున పార్కింగ్‌ ఫీజుగా వసూలు చేయాలి. ఒక రోజంతా బండిని పార్క్‌ చేస్తే రూ.50 చెల్లించాలి. కారు పార్కింగ్‌కు మూడు గంటలకు రూ.20, 15 గంటలకు రూ.50, ఒక రోజంతా కారు పార్క్‌ చేస్తే  రూ.75  మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ పార్కింగ్‌ ఫీజులు వాహనదారులకు స్పష్టంగా కనిపించకుండా బోర్డులను  పార్కింగ్‌ స్థలాలకు దూరంగా  ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా  ఏదో హడావిడిలో  ఉండే  ప్రయాణికులు  పెద్దగా పట్టించుకోకుండానే అడిగినంతా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ  పార్కింగ్‌  ఫీజుల గురించి స్పష్టమైన అవగాహనతో నిలదీస్తే మాత్రం  బెదిరింపులకు గురి కావలసి వస్తుంది.  

మరోవైపు  పార్కింగ్‌ గంటల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. మూడు గంటలపైన ఒక నిమిషం గడిచినా  అదనంగా  రూ.10 చెల్లించాల్సిందే..ప్రయాణికుడు 15 గంటల పాటు బండి నిలిపినప్పుడు మాత్రమే  రూ.30 చెల్లించవలసి ఉండగా, ప్రతి మూడు గంటల చొప్పున  లెక్కలు వేసి  కనీసం  రూ.50  వరకు వసూలు చేస్తున్నట్లు  ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అలాగే  24 గంటల వ్యవధిలోనూ  మార్పులు చేసి అదనపు  వసూళ్లకు పాల్పడుతున్నారు.  

చర్యలు శూన్యం… 
బస్‌స్టేషన్‌లలో విక్రయించే  తినుబండారాలు, వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్, టిఫిన్స్‌తో సహా అన్నింటిపైన  అధిక ధరలు వసూలు చేసినా  ఆర్టీసీ  అధికారులు  చర్యలు తీసుకోవడం లేదు. పార్కింగ్‌ నిర్వాహకుల దోపిడీపై కూడా చర్యలు శూన్యం. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రం నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు.  

రేట్లు కనిపించకుండా పెట్టారు   
జేబీఎస్‌ లో బండి పార్క్‌ చేయాలంటే  ఆలోచించాల్సి వస్తుంది. రేట్లు  కనిపించకుండా   ఎక్కడో పైన పెట్టేస్తారు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే  అదంతే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతారు. వాళ్లతో గొడవ ఎందుకని  అడిగినంతా ఇచ్చి రావాల్సి వస్తోంది.