మరోసారి గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించటంతో… తమ పరిస్థితేంటని మదనపడుతున్నారు అభ్యర్థులు. సుప్రీంలో కూడా ఇదే తరహా తీర్పు వస్తే… అంతే సంగతులు అని వాపోతున్నారు. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వటంతో సంచలనంగా మారింది. ఈ తీర్పును అప్పీల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను కూడా ఆశ్రయించింది టీఎస్పీఎస్పీ. అయితే ఇక్కడ అదే తీర్పు వచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సబబే అని స్పష్టం చేసింది. ఫలితంగా పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికే ఒకసారి పరీక్ష రద్దు కాగా.. పలు కారణాలతో రెండోసారి కూడా ఎగ్జామ్ రద్దు కావటంతో అభ్యర్థులు వాపోతున్నారు.గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో…. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. హైకోర్టు తాజా తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది.
ఇక తీర్పు తుది కాపీ రాగానే వచ్చేవారంలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో చాలా మంది అభ్యర్థుల్లో కొంత ఆశలు చిగురిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ… పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే….గ్రూప్ 1 ప్రక్రియ ముందుకెళ్లటం ఖాయమే. కానీ అలా కాకుండా… ఉన్నత న్యాయస్థానం లేవనెత్తిన అంశాలనే అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రస్తావించి.. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తే పరిస్థితేంటన్న చర్చ గ్రూప్ 1 అభ్యర్థుల్లో తెగ జరుగుతోంది.ఇక సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే… మళ్లీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే…. ఎగ్జామ్ నిర్వహణ కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే పలు పరీక్షల తేదీలు ఖరారు కాగా… మరోవైపు వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ప్రకటించటం, నిర్వహించటం అంత సులభమైన ప్రక్రియగా కనిపించటం లేదు. దీనిపై కమిషన్ ఏం చేయబోతుందనేది కూడా అత్యంత కీలకంగా మారింది.
ఇక 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది గ్రూప్ 1 కు అప్లై చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11న మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించగా… ఇందులో గతంలో అనుసరించిన బయోమెట్రిక్ విధానాన్ని మినహాయించింది. ఈ అంశాన్నే పలువురు అభ్యర్థులు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయిచటంలో ఈ పరీక్షను తాజాగా న్యాయస్థానం రద్దు చేసింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. మొత్తంగా 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు ప్రిలిమ్స్ పై సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్నారు.