మధ్యప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వేలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను అక్కడ ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అక్కడ పర్యటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బిజెపి నాయకత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన పేరు ప్రకటన కూడా పెండింగ్లో ఉంచడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.”సమిష్టి నాయకత్వం” పేరుతో పార్టీ నాయకులందరినీ ఎన్నికల బరిలోకి దించుతోంది.ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ.. నవంబర్_ డిసెంబర్ మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
బిజెపి 76 సీట్లకు గానూ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ముఖ్యమంత్రి పేరు, సీటూ రెండూ లేకపోవడం విశేషం. ఇదే సమయంలో ముగ్గురు కేంద్రమంత్రులు సహా నలుగురు లోక్ సభ సభ్యులకు బిజెపి అధిష్టానం టికెట్లు కేటాయించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆహార శుద్ధి, జల శక్తి శాఖల సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖల సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, లోక్ సభ ఎంపీలు గణేష్ సింగ్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ లను బరిలోకి దించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ల వ్యూహలో భాగమని తెలుస్తోంది. బలహీనంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే కాక.. దాని చుట్టుపక్కల సీట్లలోనూ విజయావకాశాలను ప్రభావితం చేయగల నేతలకు ఏరి కోరి టికెట్లు ఇస్తున్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి.
ఇక బలమైన నేతలుగా ఉన్న నలుగురు ఎంపీలతో పాటు తోమర్( దిమానీ), కులస్తే( నివాస్) పోటీ చేసే స్థానాల్లో గత ఎన్నికల్లో బిజెపి గెలవకపోవడం విశేషం. కేంద్ర మంత్రి సింధియాకు మాత్రమే అసెంబ్లీ సీటు ఇంతవరకు కేటాయించలేదు.. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బుధ్ నీ స్థానం నుంచి 2006 ఉప ఎన్నికల నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. బిజెపి ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలో సీటు కేటాయించకపోవడంతో చౌహన్ కు మొండి చెయ్యి చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని తానై ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, కీలకమైన నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఐకమత్యం, సమిష్టి నాయకత్వంతోనే ముందుకెళ్లాలని ఎత్తుగడ వెనుక చౌహాన్ ను పక్కన పెట్టాలనే ఉద్దేశం ఉందని కమల నాధులు అంటున్నారు.
అందుకే తెరపైకి సీనియర్లను తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. అయితే చౌహాన్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ పుంజుకోవడంతో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారని కమల నాయకులు అంటున్నారు. మరోవైపు చౌహాన్ ను పక్కన పెట్టడం ద్వారా బిజెపి తన ఓటమిని ఒప్పుకుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.