సీఎం జగన్ రెడ్డి కొత్త బటన్ నొక్కుతున్నారు. వాహన మిత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో పదివేలు జమ చేయబోతున్నారు. ఏపీలో ఆటోలు, కార్లు ఇలాంటి వాహనాలపై ఆధారపడేవాళ్లు నియోజకవర్గానికి వెయ్యి మంది కూడా లేరా అని ఆశ్చర్యపోవద్దు. ప్రభుత్వానికి చెందిన ఏ పథకానికి అయినా లబ్దిదారులను ఆ మేరకే ఎంపిక చేస్తారు. ఆ విషయం పక్కన పెడితే.. బటన్ నొక్కితే డబ్బులు వస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. సీఎం జగన్ రెడ్డి నెల రోజుల కిందట ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు రూ. ఆరు వందల కోట్లకు బటన్ నొక్కారు. ఇందు కోసం కోట్ల ఖర్చుతో బహిరంగసభ ఏర్పాటు చేసి రాజకీయంగా అందర్నీ తిట్టారు. మరి ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు పడ్డాయా అంటే.. ఇప్పటికీ అరవై శాతం మందికి జమ కాలేదు. ఓ వైపు కాలేజీలు ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. మరో వైపు డబ్బులు జమ కాలేదు. ఇటీవలే కాపు నేస్తం బటన్ నొక్కారు. ఎప్పుడు పడతాయో తెలియదు. ఓ నాలుగైదు శాతం మంది ఖాతాల్లో డబ్బులేసి.. మిగతా వారిని ఎదురు చూసేటట్లు చేస్తున్నారు.
ఎవరైనా రాలేదు అని బయటకు చెబితే ఇక శాశ్వతంగా రావనే బెదిరింపులు షురూ చేస్తున్నారు. కామెడీ ఏమిటంటే. .. అమ్మఒడి డబ్బులు ఇప్పటికీ కొంత మందికి జమ చేస్తూనే ఉన్నారు. తాజాగా వాహన మిత్ర బటన్ నొక్కుతున్నారు. ఎప్పటికే జమ చేస్తారో. ఎప్పుడు డబ్బులు ఉంటే.. అప్పుడు జమ చేసేదానికి బటన్ నొక్కాడనికి ఫుల్ పేజీ ప్రకటనలు… కోట్లు ఖర్చు పెట్టి బహిరంగసభలు ఎందుకనేది అర్థం కాని విషయం. డబ్బులు లేక ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ఈ నెలలో చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ దాని గురించి ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మొత్తంగా పథకాల క్యాలెండర్ కూడా దారి తప్పింది. డబ్బులూ సమయానికి రావడంలేదు. ఇక జగన్ రెడ్డి అవసరం ఏమిటన్న చర్చ కూడా ప్రారంభమయింది.