తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా గులాబీ బాస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేసేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా పార్టీలు వదులుకోవడం లేదు. ఓటర్ల కటాక్షం కోసం ఇప్పటి నుంచే వరాలు కురిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హామీల మీద హామీలిచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలతో మేనిఫెస్టోను ప్రకటించేసింది. హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్, బిజేపీలకు షాకిచ్చేలా గులాబీ పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రత్యర్థులు ఊహించని విధంగా కొత్త పథకాలను తీసుకొస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు హింటిచ్చారు.తెలంగాణ ప్రజలకు త్వరలోనే సీఎం కేసీఆర్ మరిన్ని శుభవార్తలు చెబుతారని వెల్లడించారు. హరీశ్ రావు వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రజలు అబ్బురపడేలా పథకాలు వస్తాయని ప్రకటించడంతో ఎలాంటి పథకాలు తీసుకొస్తారు ? ఎంత నిధులు ఖర్చు చేస్తారు ? కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమా ? లేదంటే సబ్బండ వర్గాలను ఆకర్షించేలా స్కీమ్ లు ఉంటాయా అన్న చర్చ మొదలైంది.
కొత్త పథకాలు తీసుకొస్తే ఎన్నికల అయ్యేంత వరకే అమలు చేస్తారా ? కంటిన్యూగా అమలు చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఉచిత కరెంట్, రైతుబంధు, ఫింఛన్ పెంపు, ఆడ పిల్ల పెళ్లికి రూ.1లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ, బిడ్డ డెలివరీకి వెళ్లితే కేసీఆర్ కిట్, డెలివరీ అయిన తరువాత నగదు అందిస్తోంది ప్రభుత్వం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తోంది. పండుటాకుల నుంచి పుట్టే బిడ్డ వరకూ అందరికీ స్కీములు అమలు చేస్తోంది. లబ్దిదారుల్లో అన్ని వయసులవారూ ఉన్నారు. కొన్ని అంశాల్లో తప్పితే, అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులు సరిపోకపోవడంతో…భూములను అమ్మేసి సమకూర్చుకుంటోంది. సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తున్నా గెలుస్తుందా అన్న అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లో ఉంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో అప్రమత్తమైన సర్కార్, మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా కొత్త పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపు తదితరాంశాలను ఎన్నికల ప్రణాళికలో ఆయన చేర్చనున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. ఇటీవలే సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రకటించారు. దసరా నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్లు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉన్న పథకాలతోపాటూ… కొత్త పథకాలు ప్రకటించడం ద్వారా… ఉన్న ఓటర్లతోపాటూ… తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చు అనేది బీఆర్ఎస్ తాజా వ్యూహంగా తెలుస్తోంది. ఉన్న పథకాలకే డబ్బు సరిపోవట్లేదు, మరి కొత్తవి ప్రకటిస్తే, వాటి అమలుకు ఎంత ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.