cong
తెలంగాణ రాజకీయం

మారుతున్న గులాబీ వాయిస్ చంద్రబాబు అరెస్ట్ ను తప్పుపడుతున్న నేతలు

బీఆర్ఎస్ నేతలు రూటు మార్చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ సెటిలైన సీమాంధ్ర ఓటర్లే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే శక్తి సీమాంధ్ర ప్రజలకు ఉంది. వారు ఎటు వైపు మొగ్గు చూపితే…ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు రాయలసీమ, ఆంధ్రా ప్రజలే ఉన్నారు. ఎన్నికల ముందు వారిని తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగింది. ఆ పథకాల గురించే తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్ణాటక గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ఓటర్లను దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించింది.  ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్… గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. 9 ఏళ్లలో ఎన్నడూ నందమూరి తారక రామారావు గురించి ప్రస్తావనే చేయలేదు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని, రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదని, తమకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే అని అన్నారు.

తనకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని, తారక రామారావు పేరులోనే పవర్‌ ఉందన్నారు. ఎన్టీఆర్‌ శిష్యుడిగా కేసీఆర్‌ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని గుర్తు చేశారు. ఉన్నట్టుండి కేటీఆర్ రూటు మార్చేయడంపై ప్రజల్లో కొత్త చర్చ మొదలైంది.  గ్రేటర్ హైదరాబాద్ లోని మెజార్టీ వర్గంగా ఉన్న సీమాంధ్రులు కాంగ్రెస్ వైపు మళ్లితే, బీఆర్ఎస్ కు ఇబ్బందులేనని, అందుకే ఎన్టీఆర్ పై కేటీఆర్ ప్రసంశలు కురిపించారని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోయినా, ఎంతో కొంత ఓటర్లు ఉన్నారని, అందుకే కేటీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని చర్చ జరుగుతోంది. కేటీఆర్ తర్వాత పార్టీ సీనియర్ నేత అయిన మంత్రి హరీశ్ రావు సైతం చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దుదృష్టకరమని, ఆయన్ను అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆందోళనల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబును అరెస్టును తప్పు పట్టారు.

మరో వైపు ఖమ్మం, నిజామాబాద్ , నల్లగొండ, కోదాడ, కొత్తగూడెం, హైదరాబాద్  కాలనీల్లో  భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ సమస్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందని, చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదని, చంద్రబాబు ఏపీలో అరెస్టు అయ్యారని అక్కడ ర్యాలీలు, ధర్నాలు చేసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆందోళనలు చేయకుండా తెలంగాణలో రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే సరికాదని, పక్క రాష్ట్రం పంచాయితీలు ఇక్కడ తేల్చుకుంటారా ? అని ప్రశ్నించారు. విజయవాడ, అమరావతి, రాజమండ్రిలో ర్యాలీలు చేసుకోవాలని, ఏపీ సమస్యపై హైదరాబాద్‌లో కొట్లాడతామంటే ఎలా? అన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడని, హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు.

హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపితే తప్పేంటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, ఏపీకి సంబంధించిన అంశాలపై ఇక్కడ నిరసన జరపొద్దని అంటే ఎలా అన్నారు. హైదరాబాద్‌లో నిరసనలు తెలిపేవారు ఇక్కడి ఓటర్లే అన్న సంగతి బిఆర్‌ఎస్ నేతలు మరవొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో నిరసనలు జరిగాయని, తెలంగాణకు అమెరికాతో సంబంధం ఏంటని నిలదీశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వారి ఓట్లు కావాలి కానీ కమ్మ వాళ్ళు హైదరాబాద్ లో నిరసన తెలిపితే అనుమతిని ఇవ్వవా అని రేవంత్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను సీమాంధ్ర సీరియస్ గా తీసుకున్నారు. ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడంతో…తెలంగాణకు ఆంధ్రా ఏంటి సంబంధమని ప్రశ్నించడంతో సీమాంధ్ర ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది. హైదరాబాద్ డెవలప్ మెంట్ లో సీమాంధ్ర ముఖ్యమంత్రులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతలు, ప్రజల భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సీమాంధ్ర ఓటర్లకు మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ సీనియర్ నేతలు వరుసగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. రెండ్రోజుల నుంచి పార్టీలోని కీలక నేతలంతా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి.