ఏపీలో విజయవాడ కనకదుర్గ గుడి ఈవో సహా కొందరు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను బదిలీ చేశారు. దుర్గ గుడి నూతన ఈఓగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ జవహార్ రెడ్డి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.డిప్యూటీ కలెక్టర్ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్ఓగా నియమించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషన్ బాధ్యతల నుంచి ఆమెను బదిలీ చేశారు. కృష్ణా జిల్లా డీఆర్ఓ వెంకట రమణను బాపట్ల జిల్లా డీఆర్ఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్వీ నాగేశ్వర రావును ఎన్టీఆర్ జిల్లా డీఆర్ఓగా నియమించారు. ఎన్టీఆర్ జిల్లా డీఆర్ఓగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ ను కనకదుర్గ ఆలయం ఈవోగా నియమించారు. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, చైర్మన్ కర్నాటి రాంబాబుకి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో ఈఓని బదిలీ చేయడంతో హాట్ టాపిక్ అవుతోంది.
రాజకీయ కోణంలోనే బదిలీ జరిగింది అంటూ ప్రచారం జరుగుతోంది. దుర్గ గుడి ఛైర్మన్ గా కర్నాటి రాంబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఆలయం అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఈవో అని అధికార పార్టీ వైసీపీ నేతలు సైతం ఆరోపించారు
నేతల మధ్య ఆధిపత్య పోరే కారణం
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో జరగాల్సి ఉండగా దుర్గగుడి ఈవోను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడం కలకలం సృష్టించింది. ఈవోను బదిలీ చేయించడానికి కొద్ది నెలలుగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ రాంబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈవోను మార్చాలని ఆలయ ఛైర్మన్ నేరుగా సిఎంకే వినతి పత్రం ఇచ్చారు. దీనిపై అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పరిధిలో వారు ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
మంత్రి పలుమార్లు హెచ్చరించిన తర్వాత కూడా వెల్లంపల్లి, కర్నాటిలు తమ ప్రయత్నాలు కొనసాగించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రిని తమ గప్పెట్లో ఉంచుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకీలాద్రి జోలికి రాకూడదన్నట్లు వ్యవహరించడం ఆ శాఖ మంత్రి ఆగ్రహం తెప్పించింది. గత ఏడాది జరిగిన దసరా ఉత్సవాల్లో మంత్రి సత్యనారాయణ ఆద్యంతం పర్యవేక్షించారు. తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై ఇతరుల పెత్తనాన్ని ఆయన అంగీకరించలేదు. మంత్రి వ్యవహార శైలి ఎమ్మెల్యేకు, ఛైర్మన్‌కు మింగుడు పడకపోవడం, అధికారులు కూడా మంత్రి చెప్పు చేతల్లోనే ఉండటంతో ప్రభుత్వ పెద్దలపై కొద్ది రోజులుగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు ప్రస్తుత ఈవోను కొనసాగిస్తే తమ పెత్తనం సాగదని భావించిన నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఆదివారం అధికారుల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 నుంచి మొదలు కానున్నాయి.
ఈ సమయంలో ఆలయ ఈవో డి.భ్రమరాంబను ప్రభుత్వం బదిలీచేయడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయశాఖకు చెందిన భ్రమరాంబను బదిలీచేసి, ఆ స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాస్‌ను ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.దుర్గగుడి ఆలయ ఛైర్మన్‌గా వెల్లంపల్లి అనుచరుడు కర్నాటి రాంబాబును నియమించారు. దుర్గగి నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌లతో ఈవో భ్రమరాంబకు పొసగడం లేదు. ఈవోకు డిప్యూటీ సిఎం, దేవాదాయశాఖ, కొట్టు సత్యనారాయణ మద్దతు ఇస్తున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో కొట్టు సత్యనారాయణ ఉత్సవాలు జరిగినంత కాలం ఆలయం వద్దే ఉంటూ, పర్యవేక్షించారు.మంత్రి తీరు స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లికి రుచించలేదు. అప్పట్లోనే వీరిమధ్య వైరం వచ్చింది. ఈసారి దసరా ఉత్సవాలను కూడా ఈవో భ్రమరాంబ నేతృత్వంలోనే జరిపించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ భావించారు. అయితే ఎమ్మెల్యే, ఛైర్మన్ ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఈవోను బదిలీ చేయించారని దేవాదాయశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నిత్యం లక్షమంది అమ్మవారి దర్శనం కోసం తరలివస్తారు. ఉత్సవాల నిర్వహణకు అధికారులతో సమన్వయం కూడా అత్యంత కీలకం కానుంది. భక్తులకు ఏర్పాట్లు, సదుపాయాల కల్పన తదితరాలన్నీ పకడ్బందీగా ఉండాలి. కొత్తగా వచ్చే అధికారికి స్థానిక పరిస్థితులు కొత్త కాబట్టి అంతా తామై చక్రం తిప్పొచ్చని నేతలు భావిస్తున్నారని దేవాదాయ శాఖలో ప్రచారం జరుగుతోంది.బదిలీపై వెళుతున్న ఈవో భ్రమరాంబకు వరుసగా రెండుసార్లు దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఆమెను బదిలీచేసి, రెవెన్యూశాఖ అధికారిని నియమించడం వెనుక వేరే కారణాలు ఉండొచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు. రెవిన్యూ అధికారిని అడ్డు పెట్టుకుని ఉత్సవాల్లో తాము చక్రం తిప్పాలన్నది వారి ప్రయత్నం కావొచ్చని చెబుతున్నారు. కొత్త అధికారి బాధ్యతలు తీసుకొని.. అన్నీ తెలుసుకొనేలోపే ఉత్సవాలు మొదలవుతాయని, తర్వాత భక్తులకు ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఈవో భ్రమరాంబకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.