తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది. బీసీ ప్రతినిధులుగా చెప్పుకునే వి.హనుమంతరావు, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లు ఈ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం అని రెండు గ్రూపులు ఉన్నాయి. తాజాగా బీసీలు ఈ రెండు గ్రూపులకు పోటీగా బీసీ టీంగా ఏర్పడ్డారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 సీట్లు ఇవ్వాలని బీసీలు పట్టుపడుతున్నారు. ఈమేరకు టీసీసీసీ చీఫ్‌తోపాటు, కాంగ్రెస్ అధిష్టానంపైగా ఒత్తిడి తెచ్చేప్రయత్నం చేశారు. ఈమేరకు మీడియా ఎదుట తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. కానీ, బీసీ నేతల వాదాన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవలే కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ను కలిసి వచ్చారు. బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కేలా చూడాలని విన్నవించారు.
తెలంగాణ ఎన్నికలు అంటేనే భారీ ఖర్చుతో కూడుకున్నవి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికార పార్టీ చేస్తున్న భారీ ఖర్చు ముందు విపక్షాలు తేలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఆర్థికంగా సమాయత్తమవుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది అసెంబ్లీ బరిలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నారు. రూ.50 కోట్లు ఖర్చు చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవొచ్చనే ఆలోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధుయాష్కీ ఈసారి ఎల్‌బీ నగర్ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావులాంటి నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికలే బెటర్ అనుకుంటున్నారు.
బీసీ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవక పోయినా పదవులు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ, రాజ్యసభ టికెట్లతోపాటు, పార్టీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీ వాదాన్ని కొంతమంది తెరపైకి తెచ్చి బలంగా వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం మాత్రం ఈ బీసీ నినాదాన్ని లైట్ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది