తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముందు వరసలో ఉంది. దసరాకు పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారని ఆయన తెలిపారు.అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ సంచలనాన్ని క్రియేట్ చేసిన బీఆర్‌ఎస్.. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము తదితర అనేక పథకాలను రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది.
ఈసారి రైతులతో పాటు యువత, మహిళలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.తెలంగాణా కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ఆరు హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోను మరింత ఆకర్శనీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తును చేస్తోంది. విజయదశమి రోజున బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించనున్నారు.అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకాలు, హామీలతోపాటు ఇప్పటికే ఉన్న వాటిని మరింత ప్రయోజనాలతో కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల మాదిరిగా అధికారిక మ్యానిఫెస్టో కమిటీ లేనప్పటికీ.. తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలను అధ్యయనం చేయడం ద్వారా మేనిఫెస్టోలో పని చేయాలని ఎస్ మధుసూధనా చారితో సహా సీనియర్ నాయకులను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే)లను సీఎం ప్రకటించాలని భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
వ్యవసాయ రుణాలపై లక్ష వరకు రుణమాఫీని ఈసారి ప్రకటించనున్నారు.నిజం చెప్పాలంటే ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉచిత ఎరువుల పథకం తీసుకొస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. అదే విధంగా అన్ని రకాల ఆసరా పింఛన్‌లను కూడా 1000 పెంచాలని సీఎం యోచిస్తున్నారు. ఇటీవల, ప్రభుత్వం వికలాంగుల పెన్షన్‌ను నెలకు 3,016 నుండి 4,016 కు పెంచిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.2014, 2018 ఎన్నికలకు ముందు హామీ ఇవ్వని బిఆర్‌ఎస్ డజన్ల కొద్దీ కొత్త పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. అమలు చేయని ప్రధాన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి. ప్రకటించాలా వద్దా అనే సందిగ్ధంలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది.