తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వార్ పీక్స్‌కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరు సభలో చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గక ముందే.. తెలంగాణలోని పలు దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు రావడం సంచలనం రేపుతున్నది. హిందూ మందిరాలపై ప్రభుత్వం పెత్తనం చేస్తోందని నిజామాబాద్ సభలో ప్రధాని ఘాటు విమర్శలు గుప్పించిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు ఐటీ నోటీసులు రావడంతో ఈ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టెంపుల్ పాలిటిక్స్‌కు దారి తీసేలా కనిపిస్తోంది.ముఖ్యంగా హిందూ మందిరాలపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తూ వాటి ఆస్తులను ప్రభుత్వమే తీసుకుంటోందని రెండు రోజుల క్రితం ప్రధాని ధ్వజమెత్తారు. హిందూ మందిరాలను నడిపించుకునే హక్కు హిందువులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఆలయాలకు ఐటీ నోటీసులు రావడంతో ఇదేనా హిందువులపై మోడీ ప్రేమ అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.
ఇక ఈ ఇష్యూపై బీజేపీ మద్దతుదారులు స్పందిస్తూ హిందూ ఆలయాల సొమ్మును ప్రభుత్వం లూటీ చేస్తోందంటూ అందువల్లే దేవాలయాల లెక్కలపై ఐటీ దృష్టి సారించిందని బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇస్తున్నారు.ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ పోటీ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. ఇటువంటి తరుణంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ముఖ్యంగా ప్రధాని మోడీ వైఖరి ఆసక్తిగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కేసీఆర్ తమ మద్దతు కోరిన సంగతి నిజామాబాద్ సభలో బహిర్గతం చేశారు. దీంతో బీఆర్ఎస్ కోసమే మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటువంటి క్రమంలో తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, బాసరలోని సర్వస్వతి అమ్మవారి ఆలయంతో సహా మరికొన్ని ముఖ్యమైన ఆలయాలకు ఐటీ తాఖీదులు పంపిన లిస్టులో ఉన్నాయి.
ఐన్ కమ్ ట్యాక్స్ కట్టడం లేదని పేర్కొంటూ హైదరాబాద్ సర్కిల్ ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ లిస్టులో కొమురవెల్లి మలన్న స్వామి ఆలయం టాప్ ప్లేస్‌లో ఉంది. మొత్తం రూ.8 కోట్ల పన్ను కట్టాలని ఇన్నాళ్లు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అదనంగా మరో రూ.3 కోట్ల జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆయా ఆలయాల నిర్వహణ అధికారులకు, ట్రస్టులకు నోటీసులు పంపింది. అయితే ఆలయాలకు ఐటీ నోటీసులు పంపించడం వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై భక్తుల వెర్షన్ ఎలా ఉన్నా రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో హిందూ సెంటిమెంట్‌తో హిందువుల ఓట్లన్నీ ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రణాళికలు వేస్తోందన్న ప్రచారం వేళ.. ఆలయాలకు ఐటీ నోటీసులు రావడం వెనుక హిందూ సెంటిమెంట్‌ను రైజ్ చేసే ఉద్దేశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇంతలో ఎప్పటి నుంచే ఆదాయపు పన్ను చెల్లించకపోతే సరిగ్గా ఎన్నికల వేళ ఐటీ నోటీసులు పంపించడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆలయాలకు ఐటీ నోటీసుల పరిణామాలతో బీఆర్ఎస్, బీజేపీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని అంతిమంగా ఎన్నికల్లో ఫైటింగ్ కాంగ్రెస్‌ను సైడ్ చేసి కారు, కమలం పార్టీల మధ్య ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.