ఈ నెల 04-06 తేదీల్లో, మూడు రోజుల పాటు చర్చలు జరిపిన తర్వాత, రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడనది RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌లో నిర్ణయించారు. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.కీలక రేట్లు పెరగలేదు అనే విషయం పైకి కనిపిస్తున్నా, గరిష్ట స్థాయికి చేరిన వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించలేదు అన్నదాన్ని ఇక్కడ అర్ధం చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్ల మీద, తీసుకోబోయే వాళ్ల మీద ఉంటుంది. అధిక వడ్డీ రేట్ల కారణంగా, సామాన్య జనం మరికొంత కాలం పాటు అధిక EMIలు చెల్లిస్తూనే ఉండాలి, రిలీఫ్ దొరలేదు.మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా, ఈ పండుగల సీజన్‌లో ఆహార ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదు. ఈ నెలలో దసరా ఉంది, 10 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి. ఆ తర్వాత దీపావళి వస్తుంది. మన దేశంలో అతి పెద్ద పండుగలు ఇవి. ఈ పండుగల సీజన్‌లో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం సామాన్యులను భయపెడుతోంది.
ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలంటే బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జులైలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతంలో ఉంది. ఆగస్టులో కాస్త శాంతించి 6.83 శాతానికి తగ్గింది. అయితే, అది ఇప్పటికీ సెంట్రల్ బ్యాంక్ కంఫర్ట్ జోన్ (2%-6%) కంటే ఎక్కువగానే ఉంది.రుతుపవన వర్షాలు దేశవ్యాప్తంగా సమానంగా కురవలేదు. ఉత్తరాదిలో కురిసిన వానను ఊళ్లను ముంచెత్తితే, దక్షిణాదిలో చినుకు రాలడం గగనమైంది. ఈ అసమాన, అనూహ్య వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయలు, పాలు, పప్పులు, ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఆహార పదార్థాల ధరలు సామాన్యుడి నెత్తి మీదకెక్కి తైతక్కలాడుతున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లోనూ ద్రవ్యోల్బణం తగ్గదని ఆర్‌బీఐ అంచనా వేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ద్రవ్యోల్బణం సగటున 5.40 శాతంగా ఉంటుందని లెక్క కట్టింది. రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.60 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.20 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 5.20 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది.అంటే, దేశంలో ధరలు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదని ఆర్‌బీఐ కూడా అంగీకరించింది. దీనిని బట్టి, ఈ పండుగ సీజన్‌లో సంబరం సామాన్యుడికి మరింత భారంగా మారుతుంది.కరోనా మహమ్మారి తర్వాత, ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి రెపో రేటును 4 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది.
చాలా కాలం పాటు 4 శాతం వద్దే ఉంచిన కేంద్ర బ్యాంక్, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో రేటును పలుమార్లు పెంచింది. 2022 మే నుంచి రెపో రేటు పెరగడం ప్రారంభమైంది, 2023 ఫిబ్రవరి వరకు ఈ సైకిల్ కొనసాగింది. ఈ కాలంలో రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం పెరిగింది. గత ఎనిమిది నెలలుగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతంగా ఉంది.