జాతీయం

డెంగ్యూ కలకలం.. 9 రాష్ట్రాలకు కేంద్ర ఉన్నతస్థాయి బృందాలు

దేశంలో డెంగ్యూ వ్యాప్తి కలకలం రేపుతున్నది. పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నతస్థాయి బృందాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం పంపింది. హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌కు ఈ కేంద్ర బృందాలు చేరుకున్నాయి. డెండ్యూ నియంత్రణ, నిర్వహణ కోసం చేపడుతున్న ప్రజారోగ్య చర్యలను పర్యవేక్షించనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులకు ప్రజారోగ్య చర్యలతో సహా సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తాయి.

కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగా ఉన్నది. అక్టోబర్‌ 31 నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన డెంగ్యూ కేసుల్లో 86 శాతం ఈ 15 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇందులో 7 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. దీంతో ఉన్నత స్థాయి వైద్య, ఇతర అధికారులతో కూడిన బృందాలను కేంద్ర ప్రభుత్వం పంపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అధికారులు కూడా ఈ నిపుణుల బృందాలలో ఉన్నారు.