అందరికంటే ముందే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం పూరించింది బీఆర్‌ఎస్. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగ్‌లందరికీ సీట్లు దక్కాయి. పార్టీ ప్రాతినిధ్యం లేని సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే, TSHDC చైర్మన్ చింతా ప్రభాకర్‌కు అవకాశం దక్కింది. అయితే ఈ సారి సిట్టింగ్ సీట్లలో అసమ్మతి పెల్లుబుకుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు మారుస్తారని ఊహాగానాలు వచ్చినా అది జరగకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారట ఆశావహులు. ఒక్క అందోల్ తప్ప మిగతా అన్ని చోట్ల అసమ్మతి, అసంతృప్తి బయటపడుతూనే ఉన్నాయి. లిస్ట్ వచ్చేదాకా పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఇక టిక్కెట్స్ రావని తేలిపోయాక ఒక్కసారిగా స్వరం పెంచారట. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డికే తిరిగి ఇవ్వడంతో టికెట్ ఆశించిన నీలం మధు రెబెల్‌గా పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, కార్యకర్తలు రోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారట. నీలం మధుకే టికెట్ ఇవ్వాలంటూ పటాన్ చెరు నుంచి బీరంగూడలో ఉన్న మల్లన్న ఆలయం వరకు ర్యాలీ తీశారు.
కేటీఆర్‌కి సన్నిహితుడినంటూ.. ప్రచారం చేసుకుని, కచ్చితంగా టిక్కెట్ వస్తుందని ఆశించారు మధు. ఇక సంగారెడ్డి లోనూ అదే పరిస్థితి ఉందట. BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టికెట్ రావడంతో అప్పటివరకు ఆశించిన నేతల్లో పులి మామిడి రాజు బీజేపీలో చేరగా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం మాత్రం పార్టీలోనే ఉంటూ అసమ్మతి పాట పాడుతున్నారు. జహీరాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కార్యకర్తల్ని పట్టించుకోడని గుర్రుగా ఉంది క్యాడర్. అయినా ఆయనకే టికెట్ ఇవ్వడంతో సొంత పార్టీ నాయకులే నిరసన స్వరం వినిపిస్తున్నారు.మరో వైపు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి పార్టీలో చేరిన ఏర్పుల నరోత్తంకి ఎస్సి కమిషన్ చైర్మన్ ఇచ్చి బుజ్జగించగా…మరో నేత ఢిల్లీ వసంత్ తన ఆవేదనని భజన రూపంలో వినిపించారట. మూడు రోజుల పాటు భజన కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై పునరాలోచించాలని కోరారట.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలను భరించలేకపోతున్నామని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలకు సీక్రెట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అసమ్మతులు స్వరం పెంచుతున్నారు. అధినాయకత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.