israel
అంతర్జాతీయం

ఇజ్రాయిల్ లో యుద్ధవాతావరణం

ఇజ్రాయేల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ ఉగ్రవాదులు రాకెట్‌లతో దాడులు చేస్తున్నారు. ఇటు ఇజ్రాయేల్ కూడా ఎదురు దాడులు కొనసాగిస్తోంది. ఫలితంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్‌లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అనవసరంగా బయటకు రావద్దని చెప్పింది. భారతీయుల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సేఫ్‌టీ ప్రోటోకాల్స్‌ని పాటిస్తూ భద్రతా శిబిరాల్లోనే ఉండాలని సూచనలు చేసింది.స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. అందులో అడ్వైజరీ డాక్యుమెంట్స్‌ లింక్‌లు షేర్ చేసింది. మిజైల్ దాడులు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందులో వివరించింది ఇండియన్ ఎంబసీ. ఇజ్రాయేల్‌లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయేల్‌లో పాలిస్తానీ ఉగ్రసంస్థ హమాస్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 వేల రాకెట్‌లతో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయేల్‌ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గాజీ సరిహద్దు ప్రాంతం వద్ద 80 కిలోమీటర్ల వరకూ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజల్ని ఉద్దేశిస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హమాస్ ఉగ్రవాదులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. “మనం యుద్ధ వాతావరణంలో ఉన్నాం. మేం కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఈ ఉదయం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌ ప్రజల మీద మెరుపుదాడులు చేశారు. వాళ్లను ఆందోళనకు గురి చేశారు. వాళ్లకు కచ్చితంగా దీటైన బదులు చెప్తాం. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం”టెల్‌ అవీవ్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది అర్సెన్ ఒస్ట్రోవ్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడిదక్కడే వదిలేసి షెల్టర్‌ల కోసం పరుగులు తీయాల్సి వస్తోందని చెప్పారు. గాజా సరిహద్దుకి దూరంగా ఉన్న వాళ్లు కాస్తో కూస్తో ప్రశాంతంగా ఉన్నారని వెల్లడించారు