“ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం..” ఈ డిమాండ్ ఈనాటిది కాదు. ఈ కోరిక ఈరోజు పుట్టింది కాదు. నెహ్రూ పరిపాలన కాలం నుంచి మొదలుపెడితే నరేంద్ర మోడీ ఏలుబడి వరకు ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన జరగడం.. కొన్నిసార్లు దానికి చైనా అడ్డు చెప్పడం.. మరి కొన్నిసార్లు అమెరికా మోకాలడ్డడం.. ఇంకొన్నిసార్లు బ్రిటన్ కుంటి సాకులు చెప్పడం.. కొన్ని సందర్భాల్లో ఫ్రాన్స్ అడ్డు పుల్ల వేయడం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే త్వరలో మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం తెరపైకి వచ్చింది. అయితే దీనిని ప్రసిద్ధ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వెలుగులోకి విశేషం. త్వరలో మనదేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది, ఎలన్ మస్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మస్క్ చేసిన వీటో వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి శాశ్వత వీటో అధికారం ఉండాలని ఎలన్ మస్క్ ప్రతిపాదించిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి స్పందించారు. ” ఐక్యరాజ్యసమితిలో, దాని అనుబంధ సంస్థల్లో చేపట్టే సంస్కరణలకు అమెరికా అనుకూలం. గతంలో ఇదే విషయంపై సర్వ ప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. విదేశాంగ శాఖ మంత్రి కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. భద్రతామండలి సహా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో సంస్కరణలకు మేము ఎప్పుడూ అనుకూలమే. ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రస్ఫుటించేలా ఉండాలని” బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి వేదాంత్ పటేల్ ప్రకటించారు.ఐక్యరాజ్యసమితిలో భారత్ లాంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరైంది కాదని జనవరిలో జరిగిన ఓ సమావేశంలో మస్క్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా కు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని మస్క్ తప్పు పట్టారు. భారత్ మాత్రమే కాదు, ఆఫ్రికాలోని అన్ని దేశాలకు ఐక్యరాజ్యసమితిలో బలమైన ప్రాతినిధ్యం ఉండాలని ఆయన కోరారు.
వర్తమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉందని మస్క్ ఆ సందర్భంగా ప్రకటించారు. అయితే ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. దీనికి అంతర్జాతీయ సమాజం కూడా మద్దతు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితిలో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వీటిలో చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాకు శాశ్వత సభ్యత్వం పేరుతో వీటో అధికారం ఉంది. మరో 10 దేశాలు రెండేళ్ల కాల పరిమితితో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవుతుంటాయి. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వడం విశేషం.