election commission
తెలంగాణ రాజకీయం

ఇక మరో లెక్క… ఎన్నికల సమరం…

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మొన్నటి వరకు ఓ లెక్క ఉంటే… ఇక నుంచి మరోలెక్క అన్నట్లు ప్రధాన పార్టీల అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. కౌంటర్లకు రీకౌంటర్లు… విమర్శలకు ప్రతివిమర్శలు… అటు నుంచి సౌండ్… ఇటు నుంచి రీసౌండ్… సెటైర్లు.. సీరియస్ కామెంట్స్… అబ్బో ఇలా ఒకటి కాదు…ఎన్నెన్నో సిత్రాలు ఇక చూడాల్సిందే..! రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు పక్కాగానే కాదు ప్లాన్ తోనూ ఉంటుంది..! ఎన్నికల నగారా మోగటంతో… సింగిల్ గా వచ్చేవారు ఎవరు ..? దోస్తీ కట్టి బస్తీమే సవాల్ అనేది ఎవరు..? పొత్తు పొడుపులు ఉంటాయా..? వార్ వన్ సైడ్ అవుతుందా..? లేక టగ్ ఆఫ్ వార్ ఉంటుందా..?వంటి ముచ్చట్లు తెలంగాణ పాలిటిక్స్ ను రసవత్తరంగా మార్చటం ఖాయమనే అనిపిస్తోంది.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(2014, 2018)… బీఆర్ఎస్(TRS) విక్టరీ కొట్టి కుర్చీపై పాగా వేసింది.

అయితే గత ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే… ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కంప్లీట్ గా వేరుగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు అన్నట్లు సాగిపోయింది…! కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. బీజేపీతో పాటు కొత్త పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయా పార్టీల అధినేతలు కూడా పబ్లిక్ లో తెగ తిరిగేస్తున్నారు. ఫలితంగా ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయనేది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది.ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే రెండో జాబితాను విడుదల చేయబోతుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. పార్టీలోని కీలక నేతలైన కేటీఆర్, హరీశ్ రావు వరుసగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. పార్టీ తలపెట్టిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ… ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు దాడిని మొదలుపెట్టారు. మరోసారి బీఆర్ఎస్ పట్టం కట్టాలని చెబుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నారు.

అక్టోబరు 16వ తేదీన మేనిఫెస్టో ప్రకటించనుంది బీఆర్ఎస్.మరోవైపు ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కీలకమైన హామీలను ప్రకటించిన జనాల్లోకి వెళ్తోంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలకు కండువాలను కప్పింది. త్వరలోనే పార్టీలోని సీనియర్లు నేతలు… బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కలిసిగట్టుగా పని చేసి… తెలంగాణ గడ్డపై హస్తం జెండాను ఎగరవేయాలి గట్టిగా భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై గురి పెట్టింది. కీలకమైన సీడబ్య్లూసీ భేటీ తో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ వచ్చిన బీజేపీ…. ఎన్నికల ఏడాదిలోకి వచ్చిన తర్వాత దూకుడు తగ్గిందనే వాదన ఉంది. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడి మార్పుతో పాటు పలు పరిణామాలు ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టిసినట్లు అయిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉన్నప్పటికీ… వచ్చే ఎన్నికల కోసం గట్టిగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించారు. ఇటీవలే పసుపు బోర్డు, ట్రైబల్ వర్శిటీతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ ప్రకటించి… తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది.

త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. వీరు ఈ మేరకు ప్రభావితం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ – కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉండేలా కనిపిస్తోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇక బీజేపీ కూడా ఒంటరిగానే బరిలో ఉండనుంది. బీఎస్పీ, జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీలు కూడా సింగిల్ గానే బరిలో ఉండేలా కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల ఒంటరిగా బరిలో ఉంటారా.. ?కాంగ్రెస్ తో కలుస్తారా…? అన్నది తేలాల్సి ఉంది.మొత్తంగా చూస్తే…. ముచ్చటగా మూడోసారి గెలిచి… హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తుంటే… ఎలాగైనా ఈసారి పవర్ లోకి రావాలని కాంగ్రెస్ కసితో ఉంది. రెండు పార్టీలకు కాకుండా… తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. ప్రజలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్టీపీ, బీఎస్పీ,జనసేన, టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే… తెలంగాణలో మరోసారి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతుంది. అంతేకాదు దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర అవకాశం ఉంటుంది.

అది ఏ రూపంలో ఉంటుందనేది అప్పటి పరిస్థితులను బట్టి అంచనా వేయవచ్చు. ఇక కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ గడ్డపై హస్తం పార్టీకి తిరుగుండదు…! కానీ మరోసారి బోల్తా పడితే మాత్రం.. కథ కంచికే అన్నట్లు ఉంటుంది. తెలంగాణలో తామే అల్టర్నేట్ అంటున్న కమలనాథులు… అసెంబ్లీ ఫైట్ లో గట్టి పరీక్షనే ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే… ఆగాల్సింది ఫలితాలు వచ్చే వరకే…!