ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు… ఏడాది ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇదేం ఖర్మ వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో… మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు చంద్రబాబు. మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక పథకాలు మినీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అంతేకాదు… ఇది ట్రైలర్ మాత్రమే అని… దసరాకు మహా మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీలను కూడా నియమించారు చంద్రబాబు. అయితే, చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ మేనిఫెస్టో విడుదల ఇప్పట్లో కష్టమని తెలుస్తోంది.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్లను వర్కౌట్ కాలేదు. ఇక… బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. స్కిల్ స్కామ్ తర్వాత… ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ల అల్లర్ల కేసు చంద్రబాబును వెంటాడుతున్నాయి. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి కొలిక్కొ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక.. చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో పార్టీ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దసరాకు టీడీపీ మేనిఫెస్టో విడుదల కష్టమనే చెప్పాలి.చంద్రబాబు అరెస్ట్ తర్వాత… టీడీపీ-జనసేన పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు.. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. అయితే… అప్పటికే రెండు పార్టీలు వేరు వేరుగా కొన్ని హామీలను ప్రకటించేశారు.
మరి ఆ హామీల సంగతేంటి..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ ప్రకటించిన హామీలను కూడా చేరుస్తారా అన్నది చూడాలి. దీనిపై తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మేనిఫెస్టోపై కసరత్తు చేయడం కష్టమే అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో దసరాకు టీడీపీ మేనిఫెస్టో విడుదల అసాధ్యమని తెలుస్తోంది. దసరాకు కాకపోతే… మరెప్పుడు మేనిఫెస్టో వస్తుందని అన్నదానిపై కూడా టీడీపీ వర్గాల నుంచి స్పష్టత లేదు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తేనే మేనిఫెస్టోపై స్పష్టత వస్తుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మినీ మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు హామీలు ఇచ్చారు చంద్రబాబు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకొచ్చారు. మహాశక్తి పథకం ద్వారా కుటుంబంలో 18ఏళ్లు నిండిన ఆడపడుచులకి స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
ఇక దీపం పథకం కింద… ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రిచ్ టూ పూర్ అనే పథకాన్ని కూడా మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు చంద్రబాబు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఇక..నిరుద్యోగులకు కూడా హామీలు ఇచ్చారు. ఏపీలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతోపాటు… యువగళం నిధి కింద నిరుద్యోగులకు నెలకు 2వేల 500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.