jagan-chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పక్కా ప్లాన్ తో వర్కౌట్ చేసిన జగన్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నెల దాటిపోయింది. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ దరఖాస్తులు, క్వాష్ పిటిషన్లపై విచారణ సాగుతూనే ఉంది. చంద్రబాబుకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందనేది అసలు ప్రశ్న. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో అవినీతి ఆరోపణలు, కోర్టు వివాదాలు ఏవైనా సులువుగా అధిగమించిన చంద్రబాబు ఇప్పుడు అత్యంత కష్ట కాలంలో ఉన్నారు. ఆయన ఏ మాత్రం ఊహించని ముప్పును ఎదుర్కొంటున్నారు. అత్యంత సమర్ధులైన న్యాయ నిపుణులకు కూడా బాబును ప్రస్తుత కష్టాల నుంచి గట్టెక్కించడం ఓ పట్టాన కుదరడం లేదు.చంద్రబాబు వివాదాల్లో చిక్కుకోవడం, అవినీతి ఆరోపణల్ని ఎదుర్కోవడం కొత్తేమి కాదు. కాకపోతే ఏనాడు వాటిలో చిక్కుకుని విలవిలలాడాల్సిన పరిస్థితి బాబుకు ఎదురు కాలేదు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ‌్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 25ఏళ్ళకు పైగా ఏ వ్యవస్థ ఆయన జోలికి రాలేకపోయాయి.ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా వాటి నుంచి సునాయాసంగా బయట పడేవారు.

ఎన్టీఆర్‌ నుంచి పార్టీని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి నిన్నమొన్నటి లక్ష్మీపార్వతి అవినీతి ఆరోపణల కేసు వరకు ఎలాంటి వివాదం నుంచైనా చంద్రబాబు ఇట్టే బయటపడ్డారు.కోర్టు కేసులు,వివాదాలను ఏమాత్రం ఖాతరు చేయని చంద్రబాబు రూ.371కోట్ల రుపాయల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నెల రోజులుగా జైల్లో ఉన్నారు. చంద్రబాబును నంధ్యాలలో సెప్టెంబర్ 9న అరెస్ట్‌ చేసినపుడు ఆ సాయంత్రానికి ఆయన బయట పడిపోతారని టీడీపీ అభిమానులు భావించారు. రోడ్డు మార్గంలో బాబును విజయవాడ తీసుకొచ్చేలోగా సమస్య పరిష్కారం అయిపోతుందనే భావనలో మెజార్టీ వర్గం ఉండిపోయింది. ఢిల్లీ నుంచి సిద్ధార్ధ లుథ్రా వంటి న్యాయవాదిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి, బాబును కోర్టులో హాజరు పరిచే సమయానికి సర్వ సన్నద్ధంగా ఉన్నారు.సిట్‌ కార్యాలయంలో విచారణ, ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. బాబు రాజమండ్రి జైల్లో అడుగు పెట్టి నేటితో నెల రోజులు పూర్తవుతోంది. సెప్టెంబర్ 11రాత్రి 1.15కు జైల్లో అడుగుపెట్టారు.

ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఈ కేసుల్లో ఎప్పుడు ఊరట దక్కుతుందనే దానిపై కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు.చంద్రబాబును జైలుకు పంపడం వెనుక నాలుగున్నరేళ్ల స్కెచ్‌ ఉన్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ మీద పై చేయి సాధించడానికి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కోర్టుల్లో, శాసనసభలో ప్రతిపక్షం అడుగడుగున అడ్డు తగులుతుంటే అసహనానికి గురై ఏకంగా శాసన మండలిని కూడా రద్దు చేయాలని కూడా భావించారు.మండలితో ఎలాంటి ఉపయోగం లేదని దానిని రద్దు చేయాలని కూడా ఆలోచన చేశారు. అంతగా బాబు అండ్ కో జగన్‌ను చికాకు పెట్టింది. కోర్టు వివాదాలు, తీర్పులు, న్యాయస్థానాల్లో ఎదురైన అడ్డంకులు జగన్‌లో పంతం పెంచినట్టు చెబుతారు.జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం తొలిదశలోనే జైలుకెళ్లి 16నెలలు జైల్లో ఉండటానికి టీడీపీ కూడా కారణం కావడంతో ఆ పార్టీ మీద బదులు తీర్చుకునేందుకు నిరంతరం అన్వేషించారు. చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో చేసిన తప్పుల్ని వెదికే ప్రయత్నాలు చేశారు.

ఇందుకోసం మొదట్లో సిఐడి దర్యాప్తు చేసినా ఆ తర్వాత సిట్‌ను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు చేసిన సవాళ్లు కూడా అధికారుల్లో చర్చకు దారి తీసినట్లు తెలుస్తోంది. తమను ఎవరు ఏమి చేయలేరంటూ పదేపదే చేసిన వ్యాఖ్యలు బాబు కొంప ముంచినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ వ్యాఖ్యల్ని చూసిచూడనట్టు వదిలేసినా, పదేపదే జైలుకెళ్లారంటూ జగన్‌ను విమర్శించడం, తనపై ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారంటూ దర్యాప్తు సంస్థల్ని ఎద్దేవా చేయడం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు బలాబలాలను బేరీజు వేసిన అధికారుల బృందం ఆయన చుట్టూ జాగ్రత్తగా ఉచ్చు బిగించింది.2022లో డీజీపీ మార్పు తర్వాత బాబు చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం మొదలైంది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్సార్‌ ఆంజనేయులు, సిట్‌ కు నేతృత్వం వహిస్తున్న కొల్లి రఘురామిరెడ్డిలు సమన్వయంతో వ్యవహరించినట్టు తెలుస్తోంది.2014-19 మధ్య జరిగిన అక్రమాలపై నాలుగేళ్ల క్రితమే దర్యాప్తు మొదలైనా వాటి వివరాలు ఎప్పటికప్పుడు బయటకు పొక్కుతున్నాయని ప్రభుత్వ పెద్దలు అనుమానించారు. ముఖ్యమైన కేసుల్లో ఆశించిన పురోగతి లేకపోవడం కూడా ఓ దశలో ప్రభుత్వ పెద్దల్ని అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

దీంతో దర్యాప్తు బృందాలను పూర్తిగా మార్చేశారు.ఆర్థిక నేరాల దర్యాప్తులో అనుభవం ఉన్న కొల్లి రఘురామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కేసుల తీరు మారిపోయింది. గతంలో ఎన్‌మార్ట్‌, క్వాంటమ్‌ వంటి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కేసుల్ని చేధించిన అనుభవం ఉండటంతో సొంత టీమ్‌తో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్‌ ల్యాండ్‌ పూలింగ్ వంటి వ్యవహారాలపై దర్యాప్తు ప్రారంభించారు.ఒక కేసులో అయితే బాబు సులువుగా జారిపోతారని భావించి ఓ పద్ధతి ప్రకారం కేసుల్ని పకడ్బందీగా నిర్మించుకుంటూ వచ్చినట్టు తెలుస్తోంది.మరోవైపు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే తలెత్తే పరిణామాలను కూడా ఇంటెలిజెన్స్‌ పక్కాగా అంచనా వేసింది. టీడీపీలో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు బాబు అరెస్ట్‌ తర్వాత తలెత్తే పరిణామాలను కూడా ముందే చర్చించుకున్నారు.కేసుల్లో ఎలా పట్టువిడుపులతో వ్యవహరించాలనే దానిపై రాజకీయ వాతావరణాన్ని అంచనా వేస్తూ ముందుకు వెళుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల విషయంలో సిట్‌, ఇంటెలిజెన్స్‌, పోలీస్ చీఫ్‌ అంచనాలు పక్కాగా వర్కౌట్ కావడంతో  వైకాపా నేతలుఖుషీగా ఉన్నారు.