చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా, దార్శనికుడిగా మీడియా కీర్తించిన నాయకుడు ఇప్పుడు జైలు గోడలకు పరిమితం అయ్యాడు. ఏ బీజేపీనైతే తిట్టిపోశారో అదే పార్టీని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో గెలుపొటములు, ఎత్తుపల్లాలు సహజమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల్లో ఓటమి అన్నది ఎరుగలేదు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ ఆవిర్భావ సమయంలో మాత్రమే బాబు ఓటమి పాలయ్యారు. ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్ నుంచి ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత ఎదురు లేకుండా పోయింది.దేశంలో సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభమైన తర్వాత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. దేశంలో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, స్పీకర్లను నియమించడంలో ప్రభావ శీలంగా వ్యవహరించారు.
ఆయన రాజకీయ చతురత సంగతెలా ఉన్నా సమయానుకూలంగా కూటములతో జట్టు కట్టడంలో తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఏ కూటమి బలంగా ఉందో ముందే అంచనా వేసి దానిని తానే సమన్వయం చేయడంలో చంద్రబాబు వ్యూహ చతురత అద్దం పడుతుంది.అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయంగా గడ్డు కాలం నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలకు వెళ్లి నెలరోజులు దాటింది. మరో మూడు కేసులు బాబును వెంటాడుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు సిఐడి కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఉన్నత కోర్టులో ఊరట లభించినా దాని ప్రభావం పెద్దగా ఉండదు.చంద్రబాబును వీలైనంత కాలం జైల్లో ఉంచాలన్న ప్రత్యర్థుల వ్యూహాలు పక్కాగా అమలవుతున్నాయి. ఇందులో ఎవరు అంతిమంగా విజేతగా నిలుస్తారనే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పీటముళ్లు బిగుసుకుంటున్న తరుణంలో చంద్రబాబు వెనువెంటనే కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటప పడటం కూడా అంత సులువు కాకపోవచ్చు.
అరెస్ట్ తర్వాత దాదాపు నెలరోజులుగా ఈ కష్టాల నుంచి బయటపడేసే శక్తుల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఒత్తిడి చేయడం ద్వారా సానుకూల ఫలితాల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దల్ని ఆశ్రయించే ప్రయత్నాలపై విస్తృత ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రెండ్రోజుల క్రితమే ఫలించాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మరికొందరు సొంత సామాజిక వర్గ నేతల ప్రమేయంతో అమిత్ షా అపాయింట్‌మెంట్ లభించింది.ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ అగ్రనేతలెవరు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన పరిణామంగానే చూశారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బాబును పూర్తిగా వదిలేసింది.ఐదేళ్ల క్రితం వరకు బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ ఆ తర్వాత అవసరానికి మించి ఘర్షణ వైఖరి అవలంబించింది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి రాజీనామాలకు సిద్ధపడిన వైసీపీకి చెక్ పెట్టే క్రమంలో పూర్తిగా ఉచ్చులో చిక్కుకుపోయింది. అంతటితో ఆగకుండా బీజేపీని నానా రకాలుగా విమర్శించింది. ప్రధాని మోదీ, అమిత్‌షాలపై బాబుతో సహా టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు.బీజేపీ బలాన్ని ఏ మాత్రం అంచనా వేయకుండానే తొందరపాటుతో వ్యవహరించింది. బీజేపీ పనైపోయిందనే భావనలో కాంగ్రెస్‌తో జత కట్టింది. ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్‌షా కాన్వాయ్ మీద రాళ్లు విసిరి, నల్లజెండాలు ఊపి, నిరసన తెలిపారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసి, మోదీని కుటుంబం బాధ్యతలు లేని మనిషి అంటూ ఎక్కిరించి తొడగొట్టి సవాలు చేశారు.బాబు జైలుకు వెళ్ళిన తర్వాత చివరకు అదే పార్టీని శరణు కోరే పరిస్థితికి వచ్చేశారు. బీజేపీ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటుందని సిబిఐకు రాష్ట్రంలో ఎంట్రీ కూడా లేదని ప్రకటించారు. అంతగా వ్యతిరేకించిన బీజేపీనే ఇప్పుడు మళ్లీ బాబు ఆశ్రయించాల్సి వచ్చింది. చంద్రబాబు అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఏమిటనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు వస్తోంది.