తెలంగాణ ముఖ్యాంశాలు

ప్రగతి వేదిక.. పచ్చని వేడుక

  • నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడత తెలంగాణకు హరితహారం
  • పది రోజులపాటు కార్యక్రమాలు.. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రజల భాగస్వామ్యంతో ముందుకు
  • ప్రజలంతా పాల్గొనండి: మంత్రి ఎర్రబెల్లి

ఒకేరోజు.. ముచ్చటగా మూడు వేడుకలకు వేదికవుతున్నది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంతోపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్నాల్లో ‘ప్రగతి’ని పరుగులు పెట్టిస్తూనే.. పచ్చనిహారంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది.

సీఎం మొదలు గ్రామ సర్పంచు దాకా, సీఎస్‌ మొదలు పంచాయతీ కార్యదర్శి వరకు అంతా పల్లె బాట పట్టేలా ప్రణాళికను సర్కారు రూపొందించింది. ఏ రోజు ఏం చేయాలో కార్యాచరణ సిద్ధంచేసింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య పనులన్నీ చేపట్టనున్నది. ఇప్పటికే హరితహారం ఆరు విడతల్లో 220.7 కోట్ల మొక్కలు నాటిన సర్కారు.. ఏడో విడతలో 19.91 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన 230 కోట్ల మార్క్‌ను దాటబోతున్నది. హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేటలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. జూలై 10వ తేదీ వరకు మొత్తం పది రోజులపాటు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి.. ప్రతి ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంలో ప్రధానంగా చేయాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ గత నెల 26న రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు పల్లె ప్రగతి విజయవంతానికి ప్రతి గ్రామం, మండలస్థాయిలో పర్యవేక్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాస్థాయి అధికారులను మండలాలకు పర్యవేక్షకులుగా, మండలస్థాయి అధికారులను గ్రామాలకు పర్యవేక్షకులుగా నియమించనున్నారు. గ్రామస్థాయిలో కార్యక్రమ నిర్వహణకు ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు.

నిధుల కేటాయింపు
పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ప్రతినెలా విడుదల చేస్తున్నారు. గ్రామాలకు నెలకు రూ.308 కోట్లు, నగరాలు, పట్టణాలకు నెలకు రూ.148 కోట్లను ఇస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామాలకు ఇప్పటివరకు రూ.3,627 కోట్లు, పట్టణాలకు రూ.2,211 కోట్లను విడుదలచేశారు. పల్లె, పట్టణ ప్రగతిలో అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తికోసం సీఎం కేసీఆర్‌.. మంత్రుల పరిధిలో రూ.2 కోట్లు అందుబాటులో ఉంచారు. గ్రామీణ ఉపాధి హామీ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులకు రూ.1432.85 కోట్లను ప్రభుత్వం విడుదలచేసింది. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులు చార్ట్‌ను రూపొందించారు. పట్టణాలు, పల్లెల్లో వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

పైనుంచి కిందిస్థాయి వరకు..
పల్లె, పట్టణ ప్రగతిలో ముఖ్యమంత్రి నుంచి గ్రామ సర్పం చ్‌, వార్డు మెంబర్‌ వరకు, సీఎస్‌ నుంచి గ్రామ కార్యదర్శి వరకు ప్రతిఒక్కరూ పాల్గొనున్నారు. గ్రామస్థాయిలో ఇప్పటికే ఉన్న పల్లె ప్రకృతి వనాలకు తోడుగా మండలకేంద్రంలో కనీ సం పది ఎకరాల్లో బృహత్‌ పల్లె పకృతి వనం పేరుతో పెద్ద పా ర్కు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణా ల్లో ఇదే తరహాలో పార్కులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణం

రాష్ట్రంలో ప్రతి పట్టణం, నగరంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లను నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు 2021-22 బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించారు.

ప్రజల భాగస్వామ్యానికి కమిటీలు

గ్రామాల్లో ప్రజలను భాగస్వాములను చేయడానికి వర్కు కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీలను అని నాలుగు కమిటీలు ఏర్పాటుచేశారు.

పట్టణాల్లో వార్డు కమిటీలను ఏర్పాటుచేశారు. ప్రతి వార్డుకు నాలుగు కమిటీలు.. యూత్‌, మహిళా, సీనియర్‌ సిటిజన్స్‌, ప్రముఖులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. కమిటీలు చేసిన తీర్మానాలను మున్సిపల్‌ కౌన్సిల్‌ ముందు పెట్టనున్నారు.

పల్లె ప్రగతి

  • మొదటి విడత 2019 సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు 30 రోజులు జరిగింది.
  • రెండోవిడత 2020 జనవరి 2 నుంచి 12 వరకు 10 రోజులపాటు కొనసాగింది.
  • మూడోవిడత 2020 జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జరిగింది.
  • నాల్గో విడత 2021 జూలై 1 నుంచి 10 వరకు పదిరోజులపాటు జరగనున్నది.

ఏ రోజు.. ఏం చేయాలి!

పల్లె ప్రగతిలో పది రోజుల కార్యక్రమాలు

హైదరాబాద్‌, జూన్‌ 30 ( నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి జరిగే జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పది రోజుల్లో ఏ రోజు ఏ పనులు చేయాలనే దానిపై పంచాయతీరాజ్‌శాఖ కార్యాచరణను రూపొందించింది. గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యాచరణను అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు.

  1. జూలై 1 గురువారం (మొదటి రోజు )
    గ్రామసభ, సీఎం కేసీఆర్‌ సందేశం చదివి వినిపించడం, పల్లె ప్రగతి ఉద్దేశాన్ని ప్రజలకు తెలపడం, గ్రామ పంచాయతీ ప్రగతి నివేదికను చదివి వినిపించడం. ప్రజల భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని వివరించడం, సభ అనంతరం గ్రామస్థులకు తడి, పొడి చెత్త వేర్వేరుగా చేయడంపై అవగాహన కల్పించాలి. గ్రామంలో శిథిలాలు ఉంటే తొలగించాలి. గ్రామంలోని అంతర్గత రోడ్ల వెంట ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి.
  2. జూలై 2, 3వ తేదీల్లో (శుక్ర, శనివారం)
    గ్రామ పంచాయతీ నర్సరీ, పల్లె ప్రకృతి వనంలో కలుపు మొక్కలను తొలగించాలి. పెద్ద మొక్కలను దగ్గరగా నాటాలి. మురికి కాలువల పూడిక తీయడం, వ్య ర్థాలను తొలగించడం, గ్రామంలో ఉన్న పబ్లిక్‌ సంస్థలు, ఓపెన్‌ ప్లాట్లలోని పిచ్చి మొక్కలను తొలగించాలి.
  3. జూలై 4 ఆదివారం
    శ్రమదానం కార్యక్రమం. ఇందులో యువకులను, మహిళా సంఘాలను భాగస్వాములను చేయడం, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్న పెంట కుప్పలు, పొదలను తొలగించాలి. గ్రామంలోని అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి.
  4. జూలై 5 సోమవారం
    గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్‌ వంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం, వీటిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం.
  5. జూలై 6 మంగళవారం
    రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, గతంలో నాటిన మొక్కల్లో చనిపోయినవాటి స్థానంలో తిరిగి నాటడం, ట్రీ గార్డుల ఏర్పాటు. తాగునీటి సరఫరా ట్యాంకుల శుభ్రం, క్లోరినేషన్‌. నల్లా గుంతలను పూడ్చ డం, తాగునీటి సరఫరా పైపులైన్‌ లీకేజీ నివారణ.
  6. జూలై 7 బుధవారం
    గ్రామంలో వంగిన, తుప్పుపట్టిన విద్యుత్తు స్తంభాలను సరిచేయడం, వేలాడుతున్న కరెంటు వైర్లను సరిచేయడం. 100 శాతం వీధి దీపాల ఏర్పాటు.
  7. జూలై 8 గురువారం
    సెగ్రిగేషన్‌ షెడ్‌, వైకుంఠధామం చుట్టూ రెండు లేదా మూడు వరుసల్లో పెద్ద పెద్ద మొక్కలను దగ్గర దగ్గర నాటడం. ఇవన్నీ బయో ఫెన్సింగ్‌, గ్రీన్‌ ఫెన్సింగ్‌ తరహాలో ఉండాలి. నర్సరీలో తప్పనిసరిగా ఫెన్సింగ్‌ ఉండాలి. గేటు, నీటి సౌకర్యాన్ని పరిశీలించి మరమ్మతులు ఉంటే చేయాలి. నర్సరీల్లో మొక్కల పేర్లను తెలుసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటుచేయడం.
  8. జూలై 9 శుక్రవారం
    సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా శుక్రవారం డ్రై డేగా పాటించాలి. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకాలను పిచికారీ చేయడం, దోమల నివారణకు ఫాగింగ్‌ చేయడం, లోతట్టు ప్రాంతాలను మొరంలో నింపి చదును చేయడం, గ్రామం మొత్తం సోడియం హైపో క్లోరైట్‌ ద్రావకంతో పిచికారీ చేయాలి.
  9. జూలై 10 శనివారం
    పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ. పది రోజుల్లో చేపట్టిన పనుల వివరాలను తెలపడం, దాతలు, కార్మి కులను సత్కరించడం, సభలో ప్రతిజ్ఞ చేయించడం.
ప్రగతి వేదిక.. పచ్చని వేడుక

పల్లె ప్రగతితో అద్భుత విజయాలు
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): యువత, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు ఇలా ప్రతి ఒక్కరు భాగస్వాములై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. పల్లెల రూపురేఖలు మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన పల్లె ప్రగతి ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారి.. కేంద్రం నుంచి అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. ఇంకా పూర్తికాని వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులను పదిరోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ఎర్రబెల్లి హెచ్చరించారు. గ్రామాల్లో చేసిన పనులకు అవసరమైన నిధులను సీఎం కేసీఆర్‌ విడుదలచేశారని, ఎక్కడా పెండింగ్‌ బిల్లులు ఉండవని స్పష్టంచేశారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఉపాధి హామీలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని చెప్పారు. అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని, అక్కడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పదిరోజుల్లో 25 జిల్లాల్లో పర్యటించనున్నట్టు వివరించారు. ప్రతి ఒక్కరు పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలని, దాతలు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు పాల్గొన్నారు.