- వైద్యనారాయణులకు శుభాకాంక్షలు
- ఆరోగ్య తెలంగాణకు మరింత కృషి: సీఎం కేసీఆర్
- నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
జాతీ య వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు సీఎం కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలని సూచించారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని పేర్కొన్నారు.
కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని చెప్పారు. రాష్ట్రంలో కరోనాను ఎదురొనే క్రమం లో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సేవలందించిన ప్రతి డాక్టరునూ, వారికి సహకరిస్తున్న కుటుంబసభ్యులను, పేరుపేరు నా మరోసారి అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. వైద్యారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు మెడికాల్ కాలేజీలను నెలకొల్పిందని గుర్తుచేశారు.
దేశంలోనే మొదటిసారిగా అన్నిరకాల రోగనిర్ధారణ చేసే కేంద్రాలను ప్రతి జిల్లాల్లో ఏర్పాటుచేశామని చెప్పారు. హైదరాబాద్, వరంగల్ సహా పలుచోట్ల మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైందని వివరించారు. అన్నిస్థాయిల దవాఖానల్లో మౌలిక వసతులను మరింత మెరుగు పరిచామని తెలిపారు. బస్తీ దవాఖాన ఏర్పాటుతో డాక్టర్ల సేవలను గల్లీలోని సామాన్యుల చెంతకు చేర్చామన్నారు. డాక్టర్లతో సహా అన్నిరకాల వైద్యసిబ్బందిని నియమించడం, ప్రమోషన్లు, మెరుగైన రీతిలో జీతభత్యాలు పెంచామని వివరించారు.
రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే వైద్యారోగ్యశాఖలో వైద్యసిబ్బంది నియామకానికి 20 వేల కొత్త పోస్టులను మం జూరుచేయడం ద్వారా ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలుపుతున్నదని పేర్కొన్నారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.