తెలంగాణ రాజకీయం

షర్మిల…. కోలుకోలేని ఎఫెక్ట్…

కాంగ్రెస్ ఒక్కోసారి తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీకి కొంత శాపంగా మారుతుంది. ఈసారి షర్మిల రూపంలో కొంత దెబ్బతినే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కండువాలు కప్పేస్తున్న పార్టీ హైకమాండ్ వైఎస్ తనయ షర్మిల విషయంలో మాత్రం ఆలోచించింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న షర్మిల ప్రతిపాదనకు హైకమాండ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం ఉంటుందా? అంటే చెప్పలేం కాని… ఆమె పోటీ చేసే పాలేరులో మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. షర్మిల తాను తొలి నుంచి పాలేరు నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ సొంత పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పాలేరులో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటంతో పాటు వైఎస్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతోనే ఆమె పాలేరును ఎంచుకున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు పాలేరు నుంచి తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలోనే తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఒక ప్రధాన సామాజికవర్గం తుమ్మల వైపు నిలిచే అవకాశం లేదంటున్నారు. అదే సమయంలో షర్మిల కూడా భారీగా ఓట్లు చీల్చుకునే అవకాశముందని, ఇది కాంగ్రెస్ పార్టీకే నష్టమన్న అంచనాలు మాత్రం వినపడుతున్నాయి. షర్మిల పోటీ చేస్తే తుమ్మల విజయానికి ఇబ్బంది ఏర్పడటం ఖాయమన్నది పరిశీలకులు సయితం అంగీకరిస్తున్న విషయం. అదే వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని ఉంటే పాలేరు ఖచ్చితంగా కాంగ్రెస్‌ ఖాతాలో పడేదని, ఇప్పుడు మాత్రం శ్రమించకతప్పదని అంటున్నారు.

షర్మిల నిర్ణయంతో పాలేరులో కారు పార్టీ అభ్యర్థి నెత్తిన పాలు పోసినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరో వైపు షర్మిల విజయావకాశాలను కూడా కొట్టిపారేయలేం అని చెబుతున్నారు. మరి వైఎస్ షర్మిల ఏ మేరకు ఓట్లు చీల్చి ఎవరికి నష్టం కలిగిస్తారు? అన్నది డిసెంబరు 3న తేలనుంది. కలిసి రాని కాలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా వైఎస్ షర్మిలకు రాజకీయాలు అస్సలు అచ్చిరాలేదనే చెప్పాలి. ఏపీలో తన అన్నను కాదని తెలంగాణలో పార్టీ పెట్టడమే షర్మిల చేసిన అది పెద్దతప్పు అని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. అన్నతో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఏదో ఒక రకంగా రాజకీయ పదవి లభించేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల చేతులు కాల్చుకున్నట్లయిందని అనే వారు ఎక్కువగా కనపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారంతా షర్మిల రాజకీయంగా వేసిన తప్పటడుగులు గురించి చర్చించు కుంటున్నారు. రాజకీయంగా బలమైన కుటుంబం నుంచి వచ్చిన షర్మిల చివరకు నామమాత్రంగా మిగిలిపోతుండటం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆమె తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేశారు. పాలేరు నియోజవర్గంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పాలేరులో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. వైఎస్ ను అభిమానించే అనేక మంది షర్మిల వెంట నడిచారు. కొందరు బయటకు రాకపోయినా పరోక్షంగా షర్మిలకు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె వేసిన ఒకే ఒక స్టెప్ మొత్తం సీన్ ను మార్చేసింది. తాను తెలిసి ఈ అడుగు వేశారా? లేదా ఏదైనా ప్రయోజనం ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఏదో ఒకటి రెండుసీట్లయినా దక్కేవి. కానీ కాంగ్రెస్‌తో కలవడం వల్ల వైఎస్ అభిమానులను కూడా షర్మిల దూరం చేసుకున్నట్లయింది. జగన్ ను కేసుల్లో ఇరికించిన కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. ఎవరికీ చెప్పకుండా తాను హడావిడిగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ ను కలసి రావడం, బెంగళూరుకు వెళ్లి పదే పదే డీకే శివకుమార్ తో మంతనాలు జరపడం వైఎస్ ను అభిమానించే వేలాది మందికి రుచించలేదు.

దీంతో షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఒంటరి అయిపోయారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఇటు సొంత సామాజికవర్గంతో పాటు వైఎస్ అభిమానులను కూడా షర్మిల తన నిర్ణయంతో దూరం చేసుకున్నట్లయింది.  విలీన ప్రతిపాదన… పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తానని చేసిన ఆమె ప్రతిపాదన కూడా ఇప్పటి వరకూ అమలు కాలేదు. వైఎస్ వ్యతిరేక వర్గం తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ కావడంతో పాలేరు సీటు కూడా దక్కే అవకాశం లేదు. గత నెల 30వ తేదీ వరకూ షర్మిల కాంగ్రెస్‌కు డెడ్ లైన్ విధించారు. దానికి కూడా స్పందన లేదు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. ఇప్పుడు షర్మిల ఒకే ఒక ఆప్షన్. తాను ఒంటరిగా పోటీ చేయడమే. తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాల్సిన పరిస్థిితి ఏర్పడింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకూ సానుకూల స్పందన రాకపోవడంతో ఇక షర్మిల ముందు మిగిలిన ఆప్షన్ ఒంటరిగా బరిలోకి దిగడం.

లేదంటే తాను ఒక్కరే పోటీ చేయడం. మరొక ఆప్షన్ పోటీకి దూరంగా ఉండి ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లో విలీనం చేయడం. మరి షర్మిల ఏం చేస్తారన్నది ఈ రోజు, రేపట్లో తెలియనుంది. 119 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఖరారు చేయడం కూడా సాధ్యం కాని పని కావడంతో ఆమె ఒంటరిగానే బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిల ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది,