telangana cong
తెలంగాణ రాజకీయం

త్రిముఖ పోటీలో ఎల్బీ నగర్

తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు పెరిగాయి. ఈ క్రమంలోనే… ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌ హస్తం కండువా కప్పేసుకున్నారు. దీంతో ఎల్బీ నగర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికారికంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలైపోయింది. ఎన్నికల షెడ్యూల్ రావటంతో…. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ జాబితా విడుదల కాగా… ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం… ఆచితూచీ అడుగులు వేస్తోంది. ఓవైపు ఆపరేషన్ ఆకర్ష్ తో కీలక నేతలను తమవైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలోనే…. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌ ను పార్టీలోకి రప్పించింది.

దీంతో ఎల్బీ నగర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎల్బీ నగర్ నియోజకవర్గం…. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. 2014 నుంచి ఇక్కడి రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. ఇక 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓడిపోయారు. అయితే కొద్దిరోజులకే సుధీర్ రెడ్డి కూడా కారెక్కారు. ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. నడిపించే నాయకుడే పార్టీ మారటంతో…. డైలామా పరిస్థితి నెలకొంది. సుధీర్ రెడ్డి పార్టీ మార్పు తర్వాత… ఇక్కడ మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు.

ఇయనే కాకుండా… స్థానిక నేతగా పేరున్న స్థానిక నేతగా పేరున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా పని చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ తమదే అన్న ధీమాలో ఇద్దరు నేతలు కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా పార్టీకి చెందిన సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్…. ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వాలని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు…. పాలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు యాష్కీకి టికెట్ ఇవ్వొద్దంటూ మొదట్నుంచి పని చేస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు జక్కిిడి ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు.ఇప్పటికే టికెట్ విషయంలో డైలామా నెలకొన్న నేపథ్యంలో…. ముద్దగోని చేరిక ఆసక్తికరంగా మారింది. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున రెండు సార్లు పోటీ చేసిన ఆయన…. సెకండ్ ప్లేస్ లో నిలిచారు. భారీగా ఓట్లను సాధించారు. అయితే ఈసారి టికెట్ రాకపోవటంతో అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆయన… తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంపాటు పని చేసిన నేతగా ముద్దగోనికి ఉంది. అయితే అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఉన్న విభేదాలతో పాటు పార్టీ టికెట్ దక్కకపోవటంతో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో….. మరోసారి ఆయన్ను ఢీకొట్టాలని రామ్మోహన్ గౌడ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే… కాంగ్రెస్ లో చేరారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆయన భార్య ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గతంలో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా గెలిచారు. అయితే భార్యభర్తలు ఇద్దరు కాంగ్రెస్ లో చేరటంతో… టికెట్ వీరి కుటుంబానికే దక్కే ఛాన్స్ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆ హామీతోనే పార్టీలోకి వచ్చారని తెలుస్తోంది.మధుయాష్కీ గౌడ్ ఎంట్రీనే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఫలితంగా కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. సడన్ గా ముద్దగోని రాకతో… టికెట్ కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య నలుగురికి చేరింది. గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు మధుయాష్కీ.

అయితే ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం కాస్త సైలెన్స్ గా ఉన్న మధుయాష్కీ… నిజామాబాద్ విషయంలో డైలామాలో పడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే…. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ టికెట్ కొత్తగా వచ్చిన ముద్దగోనికి దక్కుతుందా లేక మిగతా ముగ్గురిలోని ఒకరికి వస్తుందా అనేది చూడాలి…!