తెలంగాణ ఎన్నికల వేళ.. అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందు వరుసలో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్.. మేనిఫెస్టో విషయాలోనూ ముందు వరుసలో నిలవానుకున్నారు. ఈమేరకు విపక్ష కాంగ్రెస్, బీజేపీ లకంటే ముందే మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం ముహూర్తం పెట్టుకున్నారు. అయితే మేనిఫెస్టో ప్రకటనకు ముందే.. ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై భారీగా అంచనాలు పెంచారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వింటే విపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుందని ప్రకటించారు. కానీ.. ఊరించి ఉసూరు మనిపించినట్లుగా కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలు, ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పెన్షన్, ఆరోగ్య సురక్ష స్కీంలను కాపీ కొట్టారు. నెల రోజులు మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు చేసినట్లు మీడియాకు లీకులు ఇచ్చిన బీఆర్‌ఎస్ నేతలు.. తీరా చూస్తే కాపీ మేనిఫెస్టో అని తేలిపోవడంతో సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, దివ్యాంగ‡ పెన్షన్లు రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించారు. అయితే ఒకేసారి కాకుండా ఐదేళ్లలో ఈ మొత్తం చేరుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ పాలసీని ఏపీలో జగన్ సర్కారు అమలు చేస్తోంది. ఇదే పాలసీని కాపీ కొట్టిన కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టనున్నట్లు మేనిఫెస్టోలో క్లారిటీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ గ్యాంరెటీ హామీల్లోల ఇది కూడా ఉంది. అధికారంలోకి రాగానే పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దానినే రూ.1000 పెంచినట్లు కనిపించింది.ఇక తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు కలిగిన అందరికీ జూన్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ హామీ. ఈమేరకు మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు తెలిపారు. దానినే కాపీ కొనట్టిన కేసీఆర్ బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చేర్చారు.ఇక సబ్సిడీ గ్యాస్ కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేస్తోంది. అధికారంలోకి రాగానే తెలంగాణలో రూ.500 లకే సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. దీనినే రూ.100కు తగ్గించి కేసీఆర్ రూ.400లకే ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.
ఇదీ కాపీ హామీనే.ఇక మహిళలకు ఆర్థికసాయం విషయంలో కాంగ్రెస్ ముందే ప్రకటించింది. అయితే ఎంత సాయం అనేది తెలుపలేదు. ఇది తమిళనాడులో అమలు చేస్తున్న స్కీం. అక్కడ రూ.2 వేలు ఇస్తుండగా, కర్ణాటకలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వాటి తరహాలోనే కేసీఆర్ మహిళా సంఘాల సభ్యులకు రూ.3 వేల సాయం ప్రకటించారు.రైతుబంధు కూడా కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిన హామీనే. ప్రస్తుతం బీఆర్‌ఎస్ సర్కార్ ఇస్తున్న రైతుబంధులు తాము అధికారంలోకి రాగానే రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంలో ప్రకటించింది. కౌలు రైతులకు కూడా రూ.10వేల సాయం ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీనే కాపీ కొట్టారు. దానిని మరో రూ.1000 పెంచి రైతుబంధును దశల వారీగా రూ.16 వేలకు తీసుకుపోతామన్నారు.బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో సొంత స్కీం ఒక్కటే కనిపిస్తోంది. అది కేసీఆర్ బీమా. తెల్ల రేషన్‌కార్డు ఉన్న 93 లక్షల మందికి రూ.5 లక్షల బీమా వర్తింపచేయడం ఒక్కటే కొత్తది. పెద్దమొత్తంలో ఓట్లు కొల్లగొట్టాలని రేషన్‌కార్డు హోల్డర్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.