kcr-bhuvanagiri
తెలంగాణ రాజకీయం

భువనగిరిలో ఐటీ పార్క్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం భువనగిరి సభలో సీఎం కెసిఆర్

యదాద్రి భువనగిరి అక్టోబర్ 16 ‘యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో.. ఈ జిల్లా భవిష్యత్‌లో అద్భుతంగా బంగారు తునకలాగ తయారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ రాక ముందు చాలామంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పారు. ఇవాళ భూముల ధరలు ఎటున్నయో మీకు తెలుసు. యాదగిరిగుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు.. సాయంత్రమైతే ఓ రేటు.. రాత్రయితే ఓ రేటు ఉన్నది. కోట్లలో రూపాయలు పలుకుతున్నది. తెలంగాణలో బ్రహ్మాండంగా భూములు పెరుగుతున్నయ్‌. భూములేని వారికి న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మిని ప్రకటించాం. మళ్లీ గెలిపిస్తే తప్పకుండా భువనగిరి అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. మళ్లీ ఎన్నికల తర్వాత బస్వాపూర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద మీటింగ్‌ పెట్టి మీ అందరి దర్శనం చేసుకుంటా. పైళ్ల శేఖర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను’ అంటూ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్‌ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. భువనగిరిలో సభలో పాల్గొని మాట్లాడారు. ‘కౌలు రైతు అంటే వ్యవసాయం చేసుకునేందుకు భూమిని మరొకరికి కిరాయికి ఇస్తాం. హైదరాబాద్‌లో భూములను కిరాయికి ఇస్తరు. ఇక్కడెందుకు కబ్జాదారుల పేరు రాయరు. రైతులు అగ్గువకు దొరికారు.. రైతులతో ఆటాడుకోవచ్చనే దురుద్దేశంతో.. రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్‌ రాజ్యం మళ్లీ రావాలా..? మళ్లీ పాత బాధలు కలగాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్‌ దెబ్బపడుతుంది. మళ్లీ పాత పైరవీకారులు వస్తరు.. వీఆర్వోలు వస్తరు.. రికార్డులు మారుతయ్‌.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు.
నేను రైతుబిడ్డనే..
‘నేను కూడా రైతుబిడ్డనే. నేను కూడా వ్యవసాయం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నా వట్టిగ ఉంటలేను. రైతుల బాధలు నాకు తెలుసుకాబట్టి మూడేళ్లు కష్టపడి అందరినీ ఒప్పించి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చాం. ఇంటి నుంచిపోతే పొద్దున 15 నిమిషాల్లో మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని కడుపులో చల్లకదలకుండా ఇంటికి వస్తున్నం. మళ్లీ మునుపటి పరిస్థితి వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. ఇంకొక మాట కూడా మనవి చేస్తున్నా. ఇవాళ అనేక రంగాల్లో తెలంగాణ బాగుపడ్డది. మన రాష్ట్రం ఏర్పడిన నాడు దారి తెల్వదు. దారి తెలియదు.. కారుచీకటి. కరెంటు లేదు. సాగు, తాగునీరు లేదు ఎన్నో కష్టాలు ఉండే. దారి పట్టుకొని ప్రయత్నం చేస్తే బాగుపడ్డాం. ఇవాళ 24 గంటల కరెంటు ఇచ్చే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. రైతులకు ఎందుకు 24గంటలకు కరెంటు అంటున్నరు. కేసీఆర్‌ వేస్ట్‌గా ఇస్తున్నడు.. మూడునాలుగు గంటలు ఇస్తే చాలు పొలాలు పారుతయ్‌ అని చెబుతున్నరు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది’ అని హెచ్చరించారు.
పైరవీకారుల మంద వస్తుంది..
‘ఒక వేళ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా ధరణిపోయి పైరవీకారుల మంద వస్తుంది. వకీలు, కోర్టుల చుట్టూ తిరగాలే. కరెంటు మాయమైతది.. దళితబంధు ఆగమైతది. దళారుల రాజ్యమే వస్తది జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. బోనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం. హైదరాబాద్‌, ఘట్కేసర్‌ దాటితే 25 కిలోమీటర్లలోనే ఉంటుంది. మొన్ననే కేటీఆర్‌కు చెప్పాను.. బోనగిరి కూడా ఐటీహబ్‌ చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలు రావాలి. కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకోవాలని అని చెప్పడం జరిగింది. త్వరలోనే ఎన్నికల తర్వాత బోనగిరికి స్పెషల్‌ ఐటీ పార్క్‌ పెట్టించే బాధ్యత నాది. ఇండస్ట్రియల్‌ పార్క్‌ను కూడా పెట్టించే బాధ్యత నాది. వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతయ్‌. నాకున్న సర్వే రిపోర్టుల ప్రకారం బోనగిరి నియోజకవర్గంలో 50వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలువబోతున్నామనే సమాచారం నాకుంది. శేఖర్‌రెడ్డి వేరే చోట సభ పెట్టాలని చెబితే.. నాకు సెంటిమెంట్‌ ఖచ్చితంగా ఇక్కడే పెడతామని చెప్పడం జరిగింది’ అన్నారు.
పొన్నాలకు చప్పట్లతో స్వాగతం పలకాలి..
‘పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో జనగామలో జాయిన్‌ అయ్యారు. ఆయనకు చప్పట్లతో ఘనస్వాగతం పలకాలి. కాంగ్రెస్‌లో విసిగి.. వేసారి.. కనీస గౌరవం లేదని చెప్పి.. సంస్కారం లేకుండా ఆ పార్టీ తయారైందని చెప్పి.. కేసీఆర్‌ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తానని సీనియర్‌ నేత మనకు ఆశీస్సులు వచ్చి బీఆర్‌ఎస్‌కు వచ్చారు. ఆయనకు మన అందరి పక్షాన స్వాగతం పలుకున్నాం. అందరినీ కోరేది ఒక్కటే. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి. శేఖర్‌రెడ్డిని దీవించండి. మనకు కులం, మతం, జాతి భేదం లేదు. నిన్న ఎన్నికల ప్రణాళిక ప్రకటించాం. అన్నివర్గాలను కవర్‌ చేశాం. మహిళలకు సాధికారత తీసుకువచ్చాం. 93లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉన్న అందరికీ కేసీఆర్‌ బీమా వస్తుంది. అదేవిధంగా అందరికీ సన్నబియ్యే వస్తయ్‌ నా మాటగా హామీ ఇస్తున్నా. మిగతా కార్యక్రమాలు ఏవి జరుగుతున్నాయో అవన్నీ కొనసాగిస్తూ.. కార్యక్రమాలను మీకు అందిస్తాం’ అన్నారు.
భువనగిరిలో ఐటీ పార్క్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం
‘యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో.. ఈ జిల్లా భవిష్యత్‌లో అద్భుతంగా బంగారు తునకలాగ తయారయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ రాక ముందు చాలామంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పారు. ఇవాళ భూముల ధరలు ఎటున్నయో మీకు తెలుసు. యాదగిరిగుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు.. సాయంత్రమైతే ఓ రేటు.. రాత్రయితే ఓ రేటు ఉన్నది. కోట్లలో రూపాయలు పలుకుతున్నది. తెలంగాణలో బ్రహ్మాండంగా భూములు పెరుగుతున్నయ్‌. భూములేని వారికి న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మిని ప్రకటించాం. మళ్లీ గెలిపిస్తే తప్పకుండా భువనగిరి అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. మళ్లీ ఎన్నికల తర్వాత బస్వాపూర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పెద్ద మీటింగ్‌ పెట్టి మీ అందరి దర్శనం చేసుకుంటా. పైళ్ల శేఖర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను’ అంటూ పిలుపునిచ్చారు.