ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్‌కు తగ్గ అవసరాన్ని డిస్కంలు తీర్చలేకపోతున్నాయి. దీంతో అప్రకటిత కోతలను డిస్కంలు విధిస్తున్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కోతలు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న అప్రకటిత కోతలతో ప్రజలు గురువారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. రోజుకు సగటున 240 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటోంది. ఇది అత్యధికం. కానీ విద్యుత్ ఉత్పత్తి , కొనుగోళ్లు అన్నీ కలిపినా డిమాండ్ ను అందులో కొరత ఏర్పడుతోంది. ఆగస్టు నెలలో మొత్తం 6 రోజులు 5 మిలియన్ యూనిట్లు పైగా కోతలు విధించారు. సుమారు 70 మిలియన్ యూనిట్ల వరకు డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పీక్ అవర్‌లో యూనిట్ ధర రూ.10ల చొప్పున ఉంది. అసాధారంగా నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
వర్షాకాలంలో పవన విద్యుత్ ఉత్పత్తి సుమారు 40 ఎంయుల వరకు ఉంటుందని ప్రస్తుతం ఇది 10 ఎంయుల లోపే ఉంటోంది. వాతావరణం వేడిగా ఉంటున్నా.. పవన్ విద్యుత్ పెరగడం లేదు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వీలైనంత మేర పగటి సమయంలోనే కోతలు విధిస్తున్నామని చెబుతున్నారు. మరో రెండు రోజుల వరకు కోతలు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆగస్టులో అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేనంతగా ఉన్నాయని, అందువల్లే కొంత కోతలు విధించాల్సి వస్తుందని చెబుతున్నారు.థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడ బొగ్గు అంటే ఉండాలి. బొగ్గు కొరత ఉండటంతో ప్లాంట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో మూడు థర్మల్ ప్లాంట్లు నడుస్తున్నాయి. నెల్లూరులోని కృష్ణపట్నం ప్లాంట్ రోజుకు 19000 మెట్రిక్ టన్ను ల బొగ్గు అవసరం. అయితే కేవలం మూడు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. రాయలసీమ ప్లాం ట్‌లో రెండు రోజులకు సరిపడ మాత్రమే ఉంది. విటిపిఎస్ ప్లాంట్‌లో రెండున్నర రోజులకు సరిపడ మాత్రమే ఉంది.
అందుకే విద్యుత్ ఉత్పత్తిని నియంత్రిస్తున్నారు. ఎన్నికల సీజన్ ముంచుకొస్తోంది. ఇలాంటి సమయంలో కోతలంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేసేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్ చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే గ్రిడ్ డిమాండ్ 18శాతం వరకూ పెరిగిందని… . గాలి లేనందున పవన విద్యుత్ గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అయినా ప్రజలకు ఇబ్బందులు రానీయబోమని హామీ ఇస్తున్నారు