kcr-mani
తెలంగాణ రాజకీయం

ఆగని మ్యానిఫెస్టో రచ్చ

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు.కొద్ది రోజులుగా ఈ మేనిఫెస్టోపై కేటీఆర్, హరీష్ రావు అంచనాల పెంచుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో ప్రకటిస్తారని హరీష్ రావు తరచూ చెప్పారు. అందుకే కేసీఆర్ ఎలాంటి పథకాలు ప్రకటిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. రైతులకు పెన్షన్  సహా అనేక కొత్త కొత్త పథకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే  కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసిన వారికి కాంగ్రెస్ మేనిఫెస్టోకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది తప్ప.. కొత్త విషయాలేం కనిపించలేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది.  కేసీఆర్ చేసిన మేనిఫెస్టో ప్రకటన చూస్తే…  కాంగ్రెస్ హామీలకు మరికొంత విలువ జోడించినట్లయింది. ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు,  ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్,   రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు,  ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు.  

వంటి హామీలన్నీ  కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఉన్న వాటికి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. పైగా కొన్ని స్కీమ్స్ కు .. ఏపీ సీఎం జగన్ ఫార్ములా పెంచుకుంటూ పోతామన్న మాటను వినియోగించారు.  కేసీఆర్ ఇలా చేయడం వల్ల… కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తాను గ్యారంటీ ఇచ్చినట్లయింది. ఎందకంటే  కాంగ్రెస్ ప్రకటించిన హమీలకు డబ్బులెక్కడివి అని ప్రశ్నించడానికి  అవకాశం లేకుడా పోయింది. కేసీఆర్ చేసిన మేనిఫెస్టో ప్రకటన కాంగ్రెస్ కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.  వెంటనే రేవంత్ రెడ్డి  ప్రెస్ మీట్ పెట్టి..తమ మేనిఫెస్టో ఎంత బలమైనదో చెప్పుకున్నారు.  ఆ హామీలు అమలు చేయలేరని..  కర్ణాటకలో చేతులెత్తేశారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కేసీఆర్ అంతకు మించిన హామీలను ప్రకటించడంతో…  అదంతా అబద్దమని చెప్పినట్లయిందని కాంగ్రెస్ వాదన.   తాము ప్రకటించిన హామీలు ఏ మాత్రం భారం కాదని కేసీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారని… అందుకే అంతకు మించినవి అమలు చేస్తామని చెబుతున్నారని కౌంటర్  ఇస్తున్నారు.  

2018  ఎన్నికల సమయంలో కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఆ సమయంలో ఈ సారి మేనిఫెస్టోలో ప్రత్యేకమైన పథకాలు ఉండబోవన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు నిరుద్యోగు భృతి, పించన్ల పెంపు వంటి హామీలను ఇచ్చింది. తర్వాత కేసీఆర్ కూడా.. లక్ష రుణమాఫీతో పాటు ఇతర హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన  దాని కంటే ఎక్కువ ఇవ్వాలని అనుకోలేదు. ప్రజలు తమపై నమ్మకం పెట్టుకున్నారని ఆయనకు క్లారిటీ ఉంది- కాట్టి… తక్కువ మొత్తం హామీలు ఇచ్చారు. అనుకున్నట్లుగానే గెలిచారు. కానీ నిరుద్యోగభృతి, రుణమాఫీ వంటి పథకాల్ని అమలు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. నిరుద్యోగభృతిని  మధ్యలో అమలు చేస్తామని ప్రకటించారు కానీ చివరికి చేయలేదు.

కానీ ఈ సారి మాత్రం కాంగ్రెస్ గ్యారంటీ హామీలకు ఎక్కువగా తాము చేస్తామని కౌంటర్ మేనిఫెస్టో ప్రకటించారు. మొదటి, రెండో మేనిఫెస్టోల్లో కేసీఆర్ చాలా వరకూ కీలకమైన పథకాలను అమలు చేయలేకపోయారు. ఇప్పుడు  వాటిని కాంగ్రెస్ నేతలు తెరపైకి తీసుకు వచ్చి.. ప్రస్తుత మేనిఫెస్టో కేసీఆర్ అమల చేయరని.. ఆయనకు చిత్తశుద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు. దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్‌పై పడింది.