- పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
- ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి
- పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం
- కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం
- విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి
- ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి
- టీఆర్‌ఎస్ కార్యవర్గ భేటీలో సీఎం కేసీఆర్
- దళితబంధు అమలులో చురుకుగా
- పాల్గొనాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
జిల్లా కార్యవర్గాల ఏర్పాటు పార్టీ గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటుచేసుకొందాం. గతంలో జిల్లాలకు సమన్వయకర్తలను ఏర్పాటుచేసుకొన్నాం ఇప్పుడు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకొంటున్నాం. కాబట్టి పాత నిర్మాణ వ్యవస్థను పునరుద్ధరించుకొందాం. జిల్లా శాఖ అధ్యక్షుడిని పార్టీ నామినేట్ చేస్తుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇతర ప్రజాప్రతినిధుల సారథ్యంలో ఇతర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.-టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్
సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమంకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని విజయవంతంచేయటానికి పార్టీ శ్రేణులు దళితవాడలకు కదలాలని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం సదుద్దేశంతో అమలు చేస్తున్నకార్యక్రమాలను అవహేళన చేస్తూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నవారి నిజస్వరూపాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఆదేశించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పార్టీ పనిచేయాలని సూచించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రెండున్నరగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, దళితబంధు పథకంపై అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
విపక్షాలకు దీటుగా జవాబివ్వండి
దళితబంధు పథకంపై పనికి మాలిన విపక్షాలు ప్రజలకు లేనిపోనివి చెప్తున్నాయని, ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ దళితవాడలకు కదలాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దళితబంధు పథకాన్ని విజయవంతం చేయటానికి తనవంతు కర్తవ్యంగా పార్టీ శ్రేణులు తోడ్పడాలని సూచించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దళితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నాయని, వారికి దీటుగా జవాబివ్వాలని ఆదేశించారు. రాష్ట్ర కార్యవర్గం నుంచి మొదలుకొని జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు దళితులను చైతన్యంచేసేందుకు కదలాలన్నారు. దళితబంధుతో విపక్షాలకు దిమ్మతిరిగిందని, ఏం చేయాలో తోచక ప్రజలను రెచ్చగొడుతున్నాయని తెలిపారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళితవర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లటం కోసం చేపట్టిన దళితబంధు ఉద్దేశాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులు కదలాలని, అదే సమయంలో మిగతా వర్గాలకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ చేయాల్సినపనులను వారికి అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు వారి వారి ప్రాంతాల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కదలాలని అందుకోసం విద్యార్థి విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
ఆటుపోట్లకు ఎదురునిలిచి..
అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఎదురునిలిచి గెలిచిన గడ్డ తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.1956లో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయినప్పటి నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సోదాహరణంగా వివరించారు. ముల్కీ ఉద్యమం, 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం..ఆ తరువాత తెలంగాణ ప్రజాసమితి ప్రస్థానం..11 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో సాగిన ఉద్యమ నేపథ్యం వంటి చారిత్రక సత్యాలను సీఎం కేసీఆర్ కండ్లకు కట్టినట్టు వివరించారు. నాటి చారిత్రక తప్పిదాలను తిరిగి చేయకూడదన్న సంకల్పంతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో తాను తీసుకున్న శపథం గురించి చెప్పారు. తెలంగాణ సాధనకు చేసిన త్యాగాలు, జరిగిన ఉపఎన్నికలు.. సాధించిన ఫలితాలు మొదలుకొని స్వరాష్ట్ర సాధనకు చేపట్టిన ఉద్యమ మజిలీలను ఆవిష్కరించారు.
సాధించినవి ఎన్నో.. సాధించాల్సినవి మరెన్నో
టీఆర్‌ఎస్ సుదీర్ఘ రాజకీయ పోరాటంలో అనేక విజయాలు సాధించిందని, స్వరాష్ర్టాన్ని సాధించుకోవటమే కాదు.. సాధించిన రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలను పార్టీ శ్రేణులకు వివరించారు. అదే సమయంలో అకుంఠిత దీక్షతో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను అదేపనిగా వ్యతిరేకించే శక్తులకు ఎక్కడిక్కడ సమాధానాలు చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఒక కేసీఆరై కదలాలని పిలుపునిచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లా కార్యవర్గాల ఏర్పాటు
పార్టీ గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటుచేసుకొందామని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో జిల్లాలకు సమన్వయకర్తలను ఏర్పాటుచేసుకొన్నామని, ఇప్పుడు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకొంటున్నాం కాబట్టి పాతనిర్మాణ వ్యవస్థను పునరుద్ధరించుకొందామని చెప్పా రు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని పార్టీ నామినేట్ చేస్తుందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇతర ప్రజాప్రతినిధుల సారథ్యంలో. ఇత ర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పార్టీ నిర్వహణ వ్యవహారాలు ఇక నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే నిర్వహించుకొనేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు.
పార్టీయే సుప్రీం
పార్టీ ఎంత పటిష్ఠంగా ఉంటే ప్రజలకు అంత మేలు జరుగుతుందని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎవరిస్థాయిల్లో వారు పనిచేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని.. ఎన్ని పనులుచేసినా.. ఎన్నివేల కోట్లతో అభివృద్ధిచేసినా వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారనే సత్యాన్ని గ్రహించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకొని క్షేత్రస్థాయిలో ఉండే నేతలు ప్రజలకు విధేయులై ఉండాలని హితవు పలికారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి అంచెలో పార్టీ పటిష్ఠంగా ఉండాలని.. పార్టీ పటిష్ఠంగా ఉంటే ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుందని, ప్రభుత్వం పటిష్ఠంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే సత్యాన్ని గుర్తెరిగి పార్టీని పటిష్ఠంచేయటంలో అందరూ ముందుండాలని తెలిపారు. సెప్టెంబర్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణం, అక్టోబర్‌లో జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకొని, పెద్ద ఎత్తున శిక్షణ తరగతులను నిర్వహించుకొందామన్నారు.
డీఎంకే తరహాలో
తమిళనాడులో దశాబ్దాల కాలంపాటు అజేయంగా ఆ రాష్ట్ర ప్రజలతో మమేకమైన డీఎంకే తరహాలో టీఆర్‌ఎస్ ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెడితే గ్రామస్థాయిలోనూ డీఎంకేకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయని, పార్టీ ఏదైనా పిలుపునిస్తే లక్ష మంది ప్రజలు కదులుతారని ఈ దిశగా టీఆర్‌ఎస్ రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. డీఎంకేకు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని, అంతకంటే వందలరెట్లలో తమిళప్రజల ఆదరణ ఆ పార్టీకి అపూర్వంగా ఉందని ఆ దిశగా టీఆర్‌ఎస్ పటిష్ఠంగా ఉండేందుకు ప్రతీ గులాబీ సైనికుడు సంసిద్ధం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు.