తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు కూడా కీలకంగా మారారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వాళ్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలు రాగానే ఏ వర్గం వారు ఏ గట్టున ఉంటారో అనే విశ్లేషణలు, లెక్కలు మొదలవుతాయి. వీటిచుట్టూనే రాజకీయాలు తిరుగుతుంటాయి. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సెటిలర్లు ఎటువైపు?’ అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం.తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ ఉంటోంది.
సెటిలర్ల అంశం మళ్లీ ఇప్పుడు తెరమీదకు రావడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎన్నడూ లేనివిధంగా ఐటి ప్రొఫెషనల్స్‌తో పాటు సెటిలర్లు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేయడం. దీనిని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు వారి మద్దతు కూడగట్టడం కోసం పోటీపడి మరీ ఈ అరెస్టును ఖండించి సెటిలర్ల మనస్సును చూరగొనాలని చూస్తున్నారు. దీంతో సెటిలర్ల ప్రభావము, వారు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ, విశ్లేషణలు మరొక్కసారి తెరపైకి వచ్చాయి.హైదరాబాద్ ఒక మినీ ఇండియా. జీవనోపాధి కోసం తెలంగాణకు ప్రధానంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వాళ్లలో ఇతర రాష్ట్రాల వారికంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చినవారే అధికంగా ఉన్నారు.
హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 40 శాతం మంది ఏపీ సెటిలర్లే ఉన్నారని ఒక అంచనా.చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఈ అరెస్టుపై ఇతర రంగాలలో ఉన్న ఏపీ సెటిలర్లు సైలెంట్‌గానే ఉన్నా ఐటీ ఉద్యోగులు వారు మాత్రం ఈ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా రోడ్డెక్కి తమ నిరసనలను తెలియజేస్తూ శని, ఆదివారాల్లో వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు.చంద్రబాబుకు మద్దతుగా గత కొన్ని వారాలుగా హైటెక్ సిటీ పరిసరాలలోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ ప్రాంతాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆందోళనలు జరిగాయి. చంద్రబాబుకు సంఫీుభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీతో పాటు మెట్రో రైలు స్టేషన్‌లో నల్లదుస్తులతో చేపట్టిన నిరసనలకు మంచి స్పందన వచ్చింది.
సాధారణంగా ఐటీ ఉద్యోగులు రోడ్లు ఎక్కరు. ఓట్లేయడానికి రాకుండా హాలీడే ఎంజాయ్ చేస్తారనే అపోహ ఉంటుంది. కానీ ఈ నిరసనలు చూసిన తర్వాత సెటిలర్ల ఓట్లు ఎక్కడ తమకు పడవేమోనన్న అనుమానంతో వీరి ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులు తమ పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు అరెస్టును ఖండించడం మొదలుపెట్టారు.చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించడంలో బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరికి మించి ఒకరు పోటీపడుతున్నారు. ఒకవైపు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందుకు భిన్నంగా ఇక్కడ ర్యాలీలు చేయొద్దని చెప్పడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. కవిత కోసం మీరు ఢిల్లీ లో ఎందుకు నిరసన చేశారని ఆయనకు ట్విట్టర్ ద్వారా నిరసన సెగ తాకేలా చేశారు. తన వ్యాఖ్యలతో జరగబోతున్న నష్టాన్ని ముందే గుర్తించిన కేటీఆర్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ‘మా దృష్టిలో రాముడంటే, కృష్ణుడంటే ఎన్టీఆరే’ అని ప్రకటించి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఈ ఒక్క కారణంగానే సెటిలర్లంతా రాబోయే ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్‌కి మద్దతివ్వబోతున్నట్లు కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు వక్ర భాష్యం చెప్తున్నారు. అయితే దీనిని ఒక నోటిమాటగా చెప్పడం సబబు కాదు. తెలంగాణలో సెటిలర్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గత ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.2009 ఎన్నికల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి సమైక్యవాదిగా ఉండటంతో పాటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అదే ఎన్నికల్లో తెలుగుదేశం బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఆంధ్రా సెటిలర్లు జీర్ణించుకోలేక తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, బిజెపితో కలిసి పోటీ చేసింది.
టిడిపి బలంగా ఉన్న స్థానాల్లో సెటిలర్లు ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, మిగిలిన స్థానాల్లోని సెటిలర్లు ఎలాగూ రాష్ట్రం ఏర్పడిరది కదా అన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చారు.ఉద్యమ సమయంలో సెటిలర్లపై ద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు 2014 తర్వాత వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఉద్యమ సమయంలో ప్రచారం జరిగినట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెటిలర్లపై వివక్ష ఉంటుందని, వారిపై దాడులు జరుగుతాయనే వ్యాఖ్యలు తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పటాపంచలయ్యాయి. దాంతో ఆ తర్వాత వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, సెటిలర్లు అత్యధిక శాతం బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడి ఆ పార్టీ విజయంలో భాగస్వాములయ్యారు.చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి హస్తం కూడా ఉందని సెటిలర్లు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గాఢంగా నమ్ముతున్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధినేతతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మరక బిజెపికి అంటించడంలో సఫలీకృతమయ్యారు. ఈ మరక అంటించుకోవడంలో బిజెపి అనుసరించిన వ్యూహాత్మక వైఫల్యం కూడా ఉంది. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు చంద్రబాబు అరెస్టు తెలంగాణలో బిజెపికి నష్టం చేకూరుస్తోంది.
సెటిలర్ల ఓట్లు కోల్పోతున్నామనే భావనతోనే, వారిని సంతృప్తి పరిచి బిజెపి వైపు తిప్పుకునేందుకు, తద్వారా రాజకీయంగా తెలంగాణలో లబ్ధిపొందడం కోసమే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు తమతో భేటీకి అవకాశం కల్పించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈ భేటీ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు ఉండటమే బిజెపి రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదం. వారు ఆ సమావేశంలో ఉండటమే కాకుండా ఆ భేటీ తరువాత ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ట్వీట్ కారణంగా బిజెపిపై మరింత అనుమానాలు బలపడుతున్నాయి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అనే సామెత ఆమె చేసిన ట్వీట్ ద్వారా తేటతెల్లమవుతోంది. అరెస్టు వెనుక బిజెపి హస్తం ఉంటే అమిత్‌షా, లోకేశ్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇస్తారు?’’ అంటూ ముగ్గురూ అమిత్‌షాతో చర్చిస్తున్న ఫొటోను ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేసి పిన్ చేయడం దీనికి నిదర్శనం.సెటిలర్లు, టిడిపి మద్దతుదారులు చంద్రబాబు అరెస్టు వెనక వైఎస్సార్సీపీని ప్రథమ ముద్దాయిగా, రెండవ ముద్దాయిగా బిజెపిని చూస్తున్నారు.
వైఎస్సార్సీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కాబట్టి వారికి ఇక్కడొచ్చే నష్టం లేమీ లేదు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలలో ఒకటైన బిజెపిని మాత్రం శిక్షించాలని సెటిలర్లు, టిడిపి మద్దతుదారులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎపిసోడ్ నేపథ్యంలో బిజేపి తలకిందులు తపస్సు చేసినా సెటిలర్లు, టిడిపి ప్రధాన మద్దతుదారుల మనసు గెలుచుకోవడం అసాధ్యమని క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో ఇక సెటిలర్లకు, టిడిపి ప్రధాన మద్దతుదారులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మాత్రమే ఆప్షన్‌గా ఉన్నాయి.సెటిలర్లు పొద్దు తిరుగుడు పువ్వుల్లాంటి వారు. అధికారం ఎటువైపు ఉంటుందో, సెటిలర్లూ అటువైపే తిరుగుతుంటారు. తమకు ఎవరు రక్షణ కల్పిస్తారు? తమ ఉద్యోగ, వ్యాపార అవకాశాలకు ఎవరు అండగా నిలబడుతారు? అని ఆలోచించుకుని అధికారంలోకి వచ్చే పార్టీకే సెటిలర్లు మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే సెటిలర్లంతా ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌కు లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలు సమీపించేకొద్ది దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.