janasena
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జనసేనలో వైసీపీ కోవర్టులు

ఏపీలో ఎన్నికల వేడి మెుదలైంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనుకునే ఆశావాహులు తమతమ ఏర్పాట్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. వీరిలో కొందరి తీరు విచిత్రంగా ఉంది. తొలుత వైసీపీలోకి టచ్‌లోకి వెళ్లడం… ఆ పార్టీ ముఖ్య నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరకు టికెట్ రాదని తెలియడంతో వారంతా ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డవారు టీడీపీలోకి వెళ్లాలంటే అక్కడే టికెట్లలొల్లి ఎక్కువగా ఉంది. సో మిగిలిన ఏకైక ఆప్షన్ జనసేన. సో వీరందరి చూపు జనసేనపై పడింది. జనసేనలో టికెట్ కోసం నానా పాట్లు పడుతున్నారు. అయితే వీరిలో కొందరు వైసీపీ కోవర్టులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి టికెట్ హామీ లభించిని ఆశావాహులను తెలివిగా జనసేనలోకి పంపించి తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిపట్ల పవన్ కల్యాణ్ అలర్ట్‌గా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వీరంతా టికెట్ వచ్చే వరకు ఒకలా ఉంటారని టికెట్ రాకపోతే పోలింగ్‌కు ముందు రోజు పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీపై బురదజల్లి భారీ డ్యామేజ్ చేస్తారని సూచిస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీలో కూడా ఇలాంటిదే జరిగిందని.. ఆ విషయాన్ని ఒకసారి పవన్ కల్యాణ్ గుర్తుకు తెచ్చుకుని జరభద్రంగా ఉండాలని లేకపోతే బొక్కబోర్లాపడక తప్పదని హెచ్చరిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏ పార్టీలో ఎవ్వరు ఎప్పుడు ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఆల్ రెడీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో టికెట్ల కోసం నేతలు గోడలు దూకుతున్నారు. ఈ పరిణామాలను ఏపీలోని ఆశావాహులు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అర్థబలం, అంగబలం తప్పనిసరి. ఇటీవల కాలంలో ఆర్థికంగా ఉన్న స్థితిమంతులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నాల్లో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోకి చేరకుండానే ముఖ్య నాయకుల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారు.

ఫలించిన వారు వైసీపీలో చేరడం ఫలించని వాళ్లు అంటే టికెట్ రాదని నిర్ధారించుకున్న వారు పక్కపార్టీలవైపు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని.. రాజకీయాల్లో తమ సత్తా చాటాలని బలంగా ఆశపడుతున్న వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. కొందరు టీడీపీలోకి టచ్‌లోకి వెళ్తే అత్యధిక శాతం మంది జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలోకి చేరనప్పటికీ పార్టీ జిల్లా అధ్యక్షులు, పీఏసీ చైర్మన్, పీఏసీ సభ్యులు, రాష్ట్రకార్యదర్శులతో పైరవీలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.ఒక పార్టీలో టికెట్ ఆశించడం రాకపోతే వేరే పార్టీలోకి జంప్ అవ్వడం సర్వసాధారణం. అయితే ఉభయగోదావరి జిల్లా రాజకీయం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీకి రహస్యంగా టచ్‌లో ఉన్న కొందరు నేతలు అక్కడ భంగపడటంతో జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకులు వీరి వెనుక ఉండి రాజకీయం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనలో టికెట్ లభిస్తే గెలుపొందేందుకు అన్ని వనరులు సమకూరుస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేగా గెలుపొందితే… ఆ తర్వాత వైసీపీలోని ముఖ్య నేతల వ్యాపార లావాదేవీలకు, మాఫియాలకు అడ్డురాకూడదని హామీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ముద్రపడిన కొందరు జనసేనలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరు వైసీపీ కోవర్టులు అని తెలిసినా.. టికెట్ లభించకపోయినా ప్రెస్‌మీట్ పెట్టి.. సోషల్ మీడియా వేదికగా జనసేనను బద్నాం చేయాలని కుట్రలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉంటే జనసేన పార్టీకోసం మెుదటి నుంచి అనేకమంది కష్టపడుతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసి తీరా టికెట్ వస్తుందని ఆశించే సమయానికి ఇలా కొత్త నాయకులు తెరపైకి రావడం వారిలో ఆందోళనకు కారణమవుతుంది. ఎన్నికలకు ఐదు నెలల ముందు కొత్త నేతలు అంతా ఎంట్రీ ఇచ్చి డబ్బు వెదజల్లి నానా హంగామా చేస్తున్నారని పార్టీ నిజమైన నాయకులు ఆరోపిస్తున్నారు. వీరి వల్ల పార్టీలో గ్రూపు రాజకీయాలు ఏర్పడటంతోపాటు.. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పార్టీకోసం సర్వం ధారబోశామని అంటున్నారు. తమకు టికెట్ వస్తుందని ఆశపడుతున్న తరుణంలో కోవర్టుల ఎంట్రీ తమ టికెట్‌కు భంగం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు. జనసేన పార్టీ హైకమాండ్ ఇలాంటి వారి పట్ల ఆచితూచి వ్యవహరించాలని… అలాగే పార్టీకోసం మెదటి నుంచి కష్టపడిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే పార్టీకి మరింత ముప్పుతప్పదని హెచ్చరిస్తున్నారు.