తెలంగాణ బీజేపీ తొలిజాబితాలో ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తొలిజాబితాలో చోటుదక్కలేదు.తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో 52 మందికి అవకాశం కల్పించగా ఇందులో 8 ఎస్సీ, 6 ఎస్టీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక, తొలి జాబితాలోనే పార్టీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీల్లో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. ప్రకటించింది 52 స్థానాలే అయినా.. అభ్యర్థులు మాత్రం 51 మంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండుచోట్ల పోటీ చేయనున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై పోటీ చేసి అమితుమీ తేల్చుకోనున్నారు.
మునుగోడు ఉపఎన్నికల ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన, రాజకీయ చర్చను లేవనెత్తిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మొదటి జాబితాలో లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాన్చి నాన్చి ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నాయకత్వం ఈ సారి ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ పోరులోకి దింపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇద్దరు ఎంపీ బరిలోకి దిగుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి అక్కడి ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఎస్టీ రిజర్వుడు స్థానం బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ ను పరీక్షించుకోనున్నారు. ఇక, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు కూడా తొలి జాబితాలో లేదు. ఆయన అంబర్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తర్వాత విడుదలయ్యే జాబితాల్లో ఆయన పేరుంటుందా? కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక దూరంగా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలై, ఆ మరుసటి ఏడాది 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి గెలిచిన ముగ్గురిలో ఇప్పుడు ఇద్దరు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోయం బాపూరావు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా ఓటమిపాలై తర్వాత ఎంపీలుగా గెలిచిన వారే. ఒక్క ధర్మపురి అర్వింద్ మాత్రమే ఇంతకు ముందు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకుండా పోటీ చేసిన తొలిసారే ఎంపీగా విజయం సాధించారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు దాదాపు అన్ని ప్రధాన పార్టీలను కవర్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 ఎన్నికల్లో బాపూరావు టీఆర్ఎస్ నుంచి బోథ్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ చాణక్యంతో, తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగంగా అప్పటి టీఆర్ఎస్ ను చీల్చారు. గులాబీ పార్టీ, కారు గుర్తుతో గెలిచి కాంగ్రెస్ బాట పట్టిన ఎమ్మెల్యేల్లో సోయం బాపూరావు ఒకరు. ఇక, ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ మరుసటి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవంబరులో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంతకు ముందు కరీనంగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ ఎమ్మెల్యే కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మీద విజయం సాధించి సంచలనం రేపారు. కాగా, నిజామాబాద్ జిల్లాను వీడి పొరుగున ఉన్న ఉమ్మడి కరీనంగర్ జిల్లా పరిధిలోని కోరుట్లకు ఇపుడు వలస వస్తున్నారు.
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెట్ పల్లి నియోజకవర్గం రద్దయ్యింది. ఆ నియోజకవర్గం పరిధిలోని మండలాలు కోరుట్ల పరిధిలోకి, కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని మండలాలతో ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం ఏర్పాటయ్యాయి. పాత మెట్ పల్లి నియోజకవర్గం బీజేపీకి వరస విజయాలు అందించిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు మూడు పర్యాయాలు విజయాలు సాధించారు. విద్యాసాగర్ రావు కరీంనగర్ ఎంపీగా విజయం సాధించాక మెట్ పల్లి నుంచి వెంకటరమణా రెడ్డి అనే నాయకుడు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీకి పట్టున్న మండలాలన్నీ ఇప్పుడు కోరుట్ల పరిధిలోనే ఉండడంతో ఇక్కడి నుంచి ఎంపీ అర్వింద్ ను పోటీకి పెడుతున్నాని విశ్లేషిస్తున్నారు.మొత్తంగా ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు