జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఇక విహార ప్రపంచానికి కూడా సరికొత్త డెస్టినీగా అవతరించబోతోంది. అద్భుత అందాలతో పులకరింపచేసే విశాఖ నగరం మీదుగా క్రూయిజ్‌లను నడిపేందుకు అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ షిప్పుల సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముల్లోకాలను మైమరిపించే అందాలు ఉన్న విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు క్రూయిజ్‌లను నడిపేందుకు ప్రపంచ ప్రఖ్యాత క్రూయిజ్ సంస్థ లిట్టోరల్ క్రూయిజ్స్ ఆసక్తిగా ఉంది. కేవలం ఆసక్తి మాత్రమే కాదు ఆ దిశగా కార్యాచరణలోకి కూడా దిగేసింది. ఇటీవలే అద్భుతమైన ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’తో విశాఖలో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచే తొలి సర్వీస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ.విశాఖ నుంచి చెన్నైకు గతంలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం కాక మునుపే ప్రముఖ క్రూయిజ్ షిప్ సంస్థ కార్డెలియా 11 అంతస్తులు ఉన్న విలాసవంతమైన క్రూయిజ్‌లను నడిపింది.
అప్పట్లో వాటికి విపరీతమైన గిరాకీ ఉండేది. టెర్మినల్ లేకపోవడంతో పార్కింగ్‌తో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్డలియా తన గమ్యస్థానాలను మార్చుకుంది. దీంతో ప్రస్తుతం వస్తుందని ఆశిస్తున్న లిట్టోరల్ సంస్థ నిర్వహించనున్న క్రూయిజ్ షిప్ 10 అంతస్తుల మేర ఉండనుంది. వీటిలో 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, మల్టీ కుజైన్ రెస్టారెంట్లు, విలాసవంతమైన బార్లు, ఆహ్లాదాన్ని పంచే స్పా, గొప్ప సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్, అంతకుమించిన నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్, కిడ్స్ ప్లే సెంటర్‌లు ఒకటేమిటి స్వర్గం అంతా అక్కడే ఉండబోతోందట. ఇవన్నీ ఒప్పందాల స్థాయి దాటి సేవలు ప్రారంభం అయితే మాత్రం విశాఖ ప్రతిష్ట మరోసారి అంతర్జాతీయ పటాలపై మారుమోగనుంది లిట్టోరల్ క్రూయిజ్స్ మొదట చెన్నై నుంచి సింగపూర్‌కు విలాసవంతమైన క్రూయిజ్ సేవలు అందించేందుకు సిద్దమైంది.
తొలి సర్వీసు నడిపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన లిట్టోరల్ తాజాగా ఆ రూట్‌ను మార్పు చేసుకుని మరింత ఎనర్జిటిక్‌గా ముందుకు వస్తోంది. ఆ కొత్త రూట్ మన విశాఖ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకోవడం.. దీనికి తోడు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో పర్యటించే విధంగా ప్రారంభం కానున్న మరో క్రూయిజ్ సర్వీస్ కూడా ఆ రూట్‌లో విశాఖను కూడా కలపాలని నిర్ణయించడం విశేషం. ఆయా టూరిస్ట్ క్రూయిజ్ షిప్ ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం విశేషం. ఆయా క్రూయిజ్‌ల విహారానికి అవసరమైన అనుమతులు కూడా ఇచ్చేందుకు వైజాగ్ పోర్టు అంగీకారం తెలిపింది. అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సర్వీసుల వివరాల్ని వెల్లడించేందుకు చెన్నెకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది.ముంబైలో ఈనెల 17 నుంచి 19 వరకు గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ – జీఎంఐఎస్ – 2023 జరిగింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సమ్మిట్‌లో పలు ఒప్పందాలు జరిగాయి.
ఈ సమ్మిట్‌లో పాల్గొన్న లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తో పాటు చెన్నెకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టులు పరస్పర అంగీకార ఒప్పందంపై సంతకాలు కూడా అయ్యాయి. వీటి ప్రకారం చెన్నై కేంద్రంగా విశాఖ మీదుగా రెండు క్రూయిజ్‌లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. వాటిలో ఒకటి చెన్నై టూ సింగపూర్ వయా వైజాగ్. విశాఖలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ ఇటీవలే సంయుక్తంగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్ 2న ప్రారంభించారు. ఆ అధునాతన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో విశాఖ అంతర్జాతీయ డెస్టినేషన్‌గా మారింది. క్రూయిజ్‌లో విహరించేవారికి అవసరమైన అన్ని సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్వీస్‌ను విశాఖ మీదుగా నడపాలని భావించినట్టు లిట్టోరల్ క్రూయిజ్ ప్రకటించడం విశేషం.
జీఎంఐఎస్ – 2023లో జరిగిన మరో ఒప్పందంలో సుమారు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్-శ్రీలంక మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఈ సర్వీసును కూడా లిట్టోరల్ సంస్థనే అందివ్వనుంది. వీలైనంత త్వరగా ఈ సర్వీసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్టు ఒప్పంద సంస్థ తెలిపింది.