మన సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ విశ్వం గురించి మనుషులకు తెలిసిన రహస్యం చాలా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలతో విశ్వాన్ని అన్వేషించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధమవుతూనే ఉంటారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఒకటి ప్రారంభమైంది. 30 ఏళ్ల ప్రణాళికను మొత్తానికి అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం గురువారం రెండు ఖండాల్లో ప్రారంభమైంది. దీనికి స్క్వేర్ కిలోమీటర్ అరే ఆబ్జర్వేటరీ (ఎస్‌కేఏవో) అనే పేరు పెట్టారు.
అసలేంటీ ఎస్‌కేఏవో ప్రాజెక్ట్?
విశ్వ రహస్యాలను ఛేదించడానికి ఇప్పుడున్న టెలిస్కోపుల సామర్థ్యం సరిపోవడం లేదు. అందుకే వాటికి పది రెట్లు ఎక్కువ శక్తివంతమైన టెలిస్కోప్‌ను రూపొందించడానికి సైంటిస్టులు నడుం కట్టారు. అందులో భాగంగా సౌతాఫ్రికాలో 200 పెద్ద డిష్ రిసీవర్లను, పశ్చిమ ఆస్ట్రేలియాలో 1,30,000 చిన్న యాంటెనాలను ఏర్పాటు చేయనున్నారు. విప్లవాత్మక శాస్త్రీయ ఆవిష్కరణల కోసం ఎస్‌కేఏవోలో భాగంగా రూపొందిస్తున్న ఈ టెలిస్కోపులు.. గతంలో ఎప్పుడూ నిర్మితం కాని రేడియో అబ్జర్వేటరీల అతిపెద్ద, సంక్లిష్టమైన నెట్‌వర్క్‌గా అభివర్ణిస్తున్నారు.
ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇప్పటి వరకూ విశ్వంలో తెలియని హద్దులను, కీలక ప్రక్రియల గురించి తెలుసుకునే వీలు కలగనుంది. గెలాక్సీల పుట్టుక, పరిణామ క్రమం, జీవం పుట్టుక వంటి అంశాలపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగనున్నాయి.
ఖర్చెంత? ఎలా పని చేస్తుంది?
సుమారు 200 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ భారీ టెలిస్కోపు 2029 వరకూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అయితే 2024 నుంచే తన సైంటిఫిక్ అబ్జర్వేషన్‌లను ప్రారంభించనుంది. ఇది ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించనుంది.
ఈ టెలిస్కోపు వ్యవస్థ 70ఎంహెచ్‌జెడ్ నుంచి 25జీహెచ్‌జెడ్ మధ్య ఫ్రీక్వెన్సీలోని రేడియో సిగ్నల్స్‌ను వినగలదు. ఇది రెండు ఖండాల్లో విస్తరించింది. సౌతాఫ్రికాలోని కారూ ఎడారిలో ఎస్‌కేఏ-మిడ్ అరే ఉంటుంది. ఇందులో భాగంగా 197 డిష్‌లు ఏర్పాటు చేస్తారు. ఇక ఎస్‌కేఏ-లో అరే నెట్‌వర్క్ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉంటుంది. దీనికోసం 1,31,072 యాంటెనాలను ఏర్పాటు చేయనున్నారు.
40 దేశాల భాగస్వామ్యం
ఈ భారీ రేడియో టెలిస్కోపు నిర్మాణంలో 40 దేశాల నుంచి 1000 మందికిపైగా పరిశోధకులు భాగస్వాములు కానున్నారు. గత వారమే నిర్మాణ ప్రక్రియ ప్రారంభానికి అనుమతులు లభించాయి. నిధులపై ఏడు వ్యవస్థాపక దేశాలు చర్చించిన తర్వాత నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, సౌతాఫ్రికా, యూకే ఉన్నాయి. ఇక ఇండియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, జపాన్, సౌత్ కొరియాలాంటి దేశాలు టెలిస్కోపు డిజైన్ ప్రక్రియలో భాగస్వాములయ్యాయి.