స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో గురువారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల్ని దాచి పెడుతోందని ఆరోపించారు. చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని బుధవారం ఆయన్ను పరిశీలించిన ప్రభుత్వాస్పత్రి కంటి వైద్యులు నివేదిక ఇచ్చినట్లు వారు చెబుతున్నారు.
అయితే, చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా సదరు నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ లోనూ ఆయన కంటి సమస్యలను ప్రస్తావించలేదని అభ్యంతరం తెలిపారు. మరోవైపు, టీడీపీ నేతల ఆరోపణలను రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఖండించారు. చంద్రబాబుకు 4 నెలల క్రితం ఓ కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదని బుధవారం ఆయన్ను పరిశీలించిన వైద్యులు చెప్పారని తెలిపారు.మరోవైపు, తిరుపతి జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తుండగా, తంగెళ్లపాలెంలో మోడం వెంకటరమణ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
‘నిజం గెలవాలి’ యాత్రపై దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ స్పందించారు. ఈ యాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే నిజం నిజంగానే గెలుస్తుందనే నమ్మకం వచ్చిందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు. నిజం గెలిచి ప్రజా విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక అరాచకాలకు అంతిమ ఘట్టం ‘నిజం గెలవాలి’ అని అశ్వనీదత్ అన్నారు.