ktr-cong
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మాటల తూటాలను పేల్చుతూ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు  కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పించారు.ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్లర్ లో రాశారు.