canada-bharat
అంతర్జాతీయం

కెనడా పౌరులకు భారత్ గుడ్ న్యూస్

కెనడా పౌరులకు వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇది కొన్ని రకాల వీసాలకే పరిమితమైంది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను మాత్రమే జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీసాల జారీ నిలిపివేయాల్సి వచ్చిందని, సమీక్షించిన అనంతరం తిరిగి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఇక పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని పేర్కొంది.ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వెలుపల ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతడ్ని హత్య చేశారు.

అయితే, ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో కెనడా సీనియర్ భారత్ దౌత్యవేత్తను బహిష్కరించారు. భారత్ కూడా కెనడాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా చేస్తున్న ఆరోపణలను అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలంటూ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది.ఈ పరిణామాల నేపథ్యంలో కెనాడా, భారత్ మధ్య వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రతలో పురోగతి ఉంటే కెనడియన్లకు వీసా సేవల్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వీసా సేవలు ప్రారంభం కావడం గమనార్హం.

భారత్‌ దౌత్యవేత్తల భద్రతకు కెనడాలో హామీ లభిస్తేనే, ఆ దేశానికి వీసాల జారీని పునరుద్ధరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం ఇటీవల చేశారు. దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడం వియన్నా ఒడంబడిక ప్రకారం ప్రాథమిక బాధ్యత అన్న ఆయన, ఆ ప్రాథమిక అంశానికి కెనడాలో సవాల్‌ ఎదురవుతోందన్నారు. పరిస్థితులు మెరుగైతే వీసాల జారీని మళ్లీ పరిశీలిస్తామన్నారు. వీసాల అంశంపై అందరికీ ఆందోళన ఉందన్న జైశంకర్, అయితే తమ దౌత్యవేత్తల రక్షణే చాలా కీలకమని వెల్లడించారు. కెనడాలో కార్యాలయానికి వెళ్లి అధికారులు వీసాలు మంజూరు చేసే పరిస్థితి లేదన్నారు. వీసాలను తాత్కాలికంగా నిలిపివేశామన్న జైశంకర్, పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోమని కెనడాను భారత్‌ కోరడాన్ని సమర్థించారు. కొన్ని రోజుల క్రితం భారత్‌లోని దౌత్య సిబ్బందిలో 41 మందితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా వెనక్కు రప్పించుకున్నట్టు కెనడా అధికారికంగా ప్రకటించింది.

62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్‌ హెచ్చరించింది. దీంతో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు కెనడా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణ ఉపసంహరించుకోవడమనేది అనూహ్యమైన చర్య అని కెనడా వ్యాఖ్యానించింది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది.